
2 రోజులైనా కానరాని యువకుడి జాడ
రామగుండం: కళ్లు మూసినా.. తెరిచినా.. ఏ శబ్దం వచ్చినా.. ఎవరైనా తలుపు తట్టినా.. ఎవరి పిలుపు విన్నా.. ఫోన్ శబ్దమైనా.. ఉలిక్కిపాటుకు గురవుతూ తన కొడుకే వస్తున్నాడనే భ్రమతో మది నిండా కన్న కొడుకునే ధ్యానిస్తూ ఓ తల్లి రోదిస్తోంది. కళ్లలో కన్నీరు ఇంకిపోయి.. 2 రోజులుగా ఇంట్లో ఓ మూలన కూర్చొని అదే మూగరోదన. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక అక్బర్‌నగర్‌కు చెందిన నారకట్ల సత్యం–మహేశ్వరి దంపతుల కుమారుడు రాజేశ్‌యాదవ్(24) శుక్రవారం గణపతి నిమజ్జన వేడుకల్లో గోదావరి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆదివారం రాత్రి వరకు గోదావరి నదిలో వివిధ ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లేదు. కనీసం కడసారి చూపుకై నా నోచుకోలేదని రోదిస్తుండడంతో.. కాలనీ ప్రజలు సైతం కన్నీటిపర్యంతమవుతున్నారు. నోరు ఎండిపోతే తోబుట్టువులు నీటి చుక్కలతో తడుపుతున్నా ఆమె రోదన మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే పలుమార్లు లోబీపీతో ఆస్పత్రిలో చేరినా.. తన కొడుకు లేని బతుకు నాకెందుకంటూ గుండెలు బాదుకుంటోంది. రాజేశ్ తల్లిదండ్రులను ఓదార్చడం స్థానిక కాలనీవాసుల తరం కావడం లేదు. 2 రోజులుగా ఏం తినకుండా వేయి కళ్లతో ఎదురుచూపులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల అరికట్టడంతో.. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఓచోట రాజేశ్ మృతదేహాన్ని గుర్తించే అవకాశముంటుందని, వివిధ ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు.
శుక్రవారం ఉదయం గోదావరిలో గల్లంతైన రాజేశ్
నా కొడుకు ఎక్కడంటూ రోదిస్తున్న మాతృమూర్తి