
పీటీఎస్‌లో ఆగని చోరీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రజా సంబంధాలు కరువయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, పశు వైద్యశిబిరాలతోపాటు పలు అభివృద్ధి పనులపై ప్రజలకు విషయాలను తెలియజేయడంలో ముందుండేది. కాని కొద్ది నెలలుగా అసలు ప్రాజెక్టులోని సీఎస్సార్ విభాగం ఏం చేస్తోంది.. అభివృద్ధి పనులను ప్రజలకు ప్రజా సంబంధాల విభాగం ఎందుకు తెలియజేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
గోప్యం ఎందుకు..
2 నెలల క్రితం ప్రాజెక్టులో క్రషర్ హామర్స్ చోరీ జరిగిన విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన మరుసటి రోజు చోరీ నిందితులను ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించిన పలు విషయాలను సైతం సంబంధిత విభాగం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటని చర్చించుకుంటున్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నుంచి రైలు మార్గం ద్వారా వచ్చే బొగ్గును కొందరు చోరీ చేస్తున్న విషయాలపై సరైన దృష్టి సారించకపోవడం, పోలీసులు సైతం చోరీ పట్టనట్లుగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. చివరకు సీఐఎస్‌ఎఫ్ విభాగం నిఘా చేపట్టి నిందితులను పట్టుకొని ఎన్టీపీసీ పోలీసులకు అప్పగిచిన విషయాన్ని సైతం పూర్తిస్థాయిలో తేటతెల్లం చేయకపోవడం వంటి విషయాలపై స్థానికులు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల పర్మినెంట్ టౌన్‌షిప్ నుంచి ఓ ట్రాక్టర్, హైడ్రాలో ఇనుస సామగ్రిని చోరీ చేసి స్క్రాప్ దుకాణదారుడికి విక్రయిస్తున్న విషయంపై సీఐఎస్‌ఎఫ్ దృష్టి సారించి చోరీని నియంత్రించడంతోపాటు నిందితులను సైతం అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ హెచ్‌ఆర్ అధికారులకు అప్పగించారు. అయినా చోరీ నిందితులు, చోరీకి సంబంధించిన విషయాలను ప్రజా సంబంధాల ద్వారా ప్రజలకు తెలియజేయకపోవడంతో అసలు ప్రజా సంబంధాలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణ పనుల వద్ద ఓ వ్యక్తిని హత్య చేసి అతడి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో గోదావరిఖని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం పీటీఎస్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గుర్తింపు సంఘం ఎన్నికల వివరాల
వెల్లడిలో సైతం..
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం అందరికీ తెలిసిందే. ఈనెల 25న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు వెలువరించిన అధికార యంత్రాంగం.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రజా సంబంధాలు తెలపకపోవడం ఏమిటని పలు యూనియన్లు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల తేదీలు, సంబంధిత అధికారుల వివరాలు, నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల నియమావళిని సైతం విడుదల చేయకపోవడంతో ఒక యూనియన్‌కు యాజమాన్యం అనుసంధానంగా వ్యవహరిస్తున్నట్లు పీటీఎస్‌లో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, ఏకపక్షంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని కొన్ని యూనియన్లు న్యూఢిల్లీ కార్పొరేట్ సెంటర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పెరుగుతున్న చోరీలు
పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఇటీవల చోరీలు అధికమయ్యాయని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీ సంస్థ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయానికి రెండువైపులా ఏ, బీ గేట్‌లున్నాయి. వాటి వద్ద 24 గంటల నిఘా ఉంటుంది. కాని చోరీలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు కొంతమేర నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. సంవత్సరం క్రితం ఎన్టీపీసీ పీటీఎస్ సెక్యూరిటీ విభాగానికి 24 గంటల కోసం ఓ వాహనం ఉండేది. దానిలో పీటీఎస్‌లో నిరంతరం గస్తీ చేపట్టేవారు. వాహనాన్ని తొలగించడంతో సెక్యూరిటీ సిబ్బంది తమ సొంత వాహనాలపై గస్తీని చేపడుతున్నారు. ఒక్కోసారి వాహనం లేక గస్తీ చేపట్టలేక చోరీలు అధికమవుతున్నాయని తెలుస్తోంది.
ప్రజా సంబంధాలు ఏమయ్యాయి..?
సంస్థ చేపట్టే కార్యకలాపాలతోపాటు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనితీరు తదితర అంశాలను ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజా సంబంధాల విభాగం కేవలం ఉన్నామా.. వచ్చామా.. పోయామా అనేలా వ్యవహరిస్తోందనేది జగమెరిగిన సత్యం. ప్రాజెక్టు పనితీరు, ప్రభావిత గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విభాగం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకపోవడంతోపాటు మాకేంది అనే విధంగా వ్యవహరించడంతో.. ప్రాజెక్టులోని పలు ఉత్తమమైన కార్యకలాపాలు, పనితీరు ప్రజలకు తెలియడం లేదు. ఎన్టీపీసీ సంస్థ గతంలో వ్యవహరించిన తీరు.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీపీసీలో ప్రజా సంబంధాలు కరువు
సెక్యూరిటీ సిబ్బందికి వాహనం లేకపోవడంతో నిఘా విఫలం
గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటో..
అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియని వైనం