
కొండగట్టు ఆలయ ద్వార బంధనం
మల్యాల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ద్వార బంధనం చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన ద్వారం మూసేశారు. ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. సోమవారం పుణ్యహచనము, సంప్రోక్షణ, తిరుమంజనము, ఆరాధన నిర్వహించిన అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి భక్తులు ఆంజనేయస్వామివారిని యధావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, లక్ష్మణప్రసాద్, హరిహరనాథ్, ఉమామహేశ్వర్, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు.