
ఉపాధి ఉత్సవం
పెద్దపల్లిరూరల్: ‘జైబోలో గణేశ్ మహరాజ్‌కీ.. గణపతి బొప్ప మోరియా’ నినాదాలతో జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ఆదిదేవుని నామస్మరణ హోరెత్తుతోంది. గతనెల 27న వినాయక చవితి సందర్భంగా మండపాల్ల కొలువుదీరిన గణపయ్య.. నవరాత్రోత్సవాల నిర్వహణలో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. గణేశుని విగ్రహాల తయారీ మొదలు.. పూజాకార్యక్రమాల నిర్వహణ వరకూ.. పురోహితులు, మండపాల వద్ద అన్నదానాలు.. వంటలతయారీ వాకెచ విగ్రహాలను మండపాలకు, ఆఖరు రోజున నిమజ్జనోత్సవానికి తీసుకెళ్లే సమయాల్లో బ్యాండ్ మేళాల వారికి, ఇక మండపాల ఏర్పాటుకు టెంట్‌హౌస్, మేదరులు, విద్యుత్‌దీపాల అలంకరణ పనుల్లో డెకోరేషన్ నిర్వాహకులు బిజీ అయ్యారు. నవరాత్రోత్సవాలు పూర్తయ్యేదాకా ఆదిదేవుని అలంకరణ కోసం వస్త్రాలు, పూలు, పండ్లు, పూజాసామగ్రి తదితర వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి.
విగ్రహ తయారీతో..
వినాయక చవితి పండుగ వస్తుందంటే నాలుగు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ పనులను కళాకారులు ముమ్మరం చేస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఆయా జిల్లా కేంద్రాల్లో పెద్దషెడ్లు ఏర్పాటు చేసి తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం అనేక ఆకృతుల్లో ఆకట్టుకునేలా గణపతి విగ్రహాలను తీర్చిదిద్దే పనులతో కేవలం పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 1,500 మంది ఉపాధి పొందుతున్నారు.
మండపాల ఏర్పాటుతో
ప్రధానకూడళ్లు.. గల్లీల్లో ఏటా ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో గణనాథులను కొలువుదీర్చే నిర్వాహకులు మండపాల తయారీకి టెంట్‌హౌస్, చలువపందిళ్లు నిర్మించారు. ఇందుకు సెంట్రింగ్ కార్మికులు, టెంట్‌హౌస్, మేదరులకు చేతినిండా పనిదొరుకుతోంది.
ఆకర్షణీయంగా అలంకరణలు..
మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలు ఆకర్షణీయంగా కనిపించేలా అలంకరించారు. డెకోరేషన్ చేసేపనుల్లో టెంట్‌హౌస్ యజమానులు తలమునకలయ్యారు. విద్యుత్ దీపకాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 300 వరకు నిమజ్జనోత్సవం నిర్వహ/ంచే దాకా పనుల్లో బిజీగా ఉంటూ ఉపాధి పొందుతున్నారు.
కిరాణాలు.. కూరగాయలు..
వినాయక మండపాల వద్ద ప్రసాదాలు, నిత్య అన్నదానాలు చేస్తుంటారు. ఇందుకు కిరాణా సామగ్రి, కూరగాయలు అవసరం. స్థానిక అవసరాలను బట్టి నిర్వాహకులు తయారు చేయిస్తుంటారు. అందుకు వాటర్‌ప్లాంట్ల నుంచి తాగునీరు, ఇస్తార్లు, గ్లాసుల వ్యాపారం కూడా జోరందుకుంది.
వంటవారికీ ఉపాఽధి..
మండపాల వద్ద నవరాత్రోత్సవాల సందర్భంగా చేసే అన్నదానాలకు అవసరమైన వంటలను సిద్ధంచేసే పనులతో వంటవారికీ ఉపాధి లభిస్తోంది. వంట తయారీకి అవసరమైనంత మంది కూలీలు కూడా అవసరమవుతారు. దాదాపు వెయ్యిమందికి పైగానే చవితి పండుగ పని కల్పిస్తోంది.
కళాప్రదర్శనలు.. డప్పుచప్పుళ్లు..
గణపతి మండపాలకు విగ్రహాల తరలింపు.. నిమజ్జనానికి తరలించేటప్పుడు తప్పనిసరిగా డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాలతో ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఇంకా కొందరైతే నిత్యం ఏదోరకమైన కళాప్రదర్శన సైతం నిర్వహిస్తుంటారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు, డోలుదెబ్బ కళాకారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అవసరాలను బట్టి కళాకారులను రప్పిస్తుంటారు. ఇక డప్పు కళాకారులకు చేతినిండా పనే. దాదాపు 300 మంది వరకు ఇలా ఉపాధి పొందుతారు.
వాహనాలకూ గిరాకీ..
వినాయక విగ్రహాలను మండపాలకు తీసుకురావడం.. నవరాత్రులపాటు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లేందుకు వాహనాలు అవసరం. ఇందుకు వారి అవసరాలను బట్టి మండప నిర్వాహకులు ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, లారీలను వినియోగిస్తుంటారు. ఇందుకు దాదాపు రెండు వేలకుపైగా వాహనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏది ఏమైనప్పటికీ వేలాది మందికి నవరాత్రి ఉత్సవాలు ఊరూరా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
నవరాత్రి వేడుకలతో ఊరూరా ఉపాధి
ప్రధాన కూడళ్లలో గణపతి మండపాలు
భక్తిభావంతో భక్తుల పూజలు
వేలాది మందికి ఉపాధి కల్పించిన వేడుకలు