
ఇటుకబట్టీ కార్మికుల స్థితిగతులపై జడ్జి ఆరా
కరీంనగర్‌క్రైం/కొత్తపల్లి: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కే.వెంకటేశ్ బృందం శుక్రవారం చింతకుంట గ్రామంలోని ఇటుకబట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలతో పాటు వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టీల వద్ద తనిఖీలు నిర్వహించటంతోపాటు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. కార్మికుల హక్కులు కాపాడాలని బట్టీల యాజమాన్యాలకు సూచించారు. కార్మికులకు ఎలాంటి చట్టపరమైన సమస్యలున్నా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి, న్యాయసాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.
భారతదేశ శక్తి ప్రపంచానికి తెలిసింది
జమ్మికుంట: అపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని, మన దేశశక్తి ప్రపంచానికి తెలిసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గాంధీచౌక్ నుంచి అంబేద్కర్‌చౌక్ వరకు అపరేషన్ సిందూర్‌కు మద్దతుగా బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మన దేశ సైనికులు ఉగ్రవాదులను అంతమొందించడమే కాకుండా, వారి స్థావరాలను ధ్వంసం చేశారన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అకుల రాజేందర్, సీనియర్ నాయకులు జీడి మల్లేశ్, ఇల్లందకుంట, వీణవంక, హుజూరాబాద్ మండలాల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, నరేశ్, తూర్పాటి రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్‌శ్యామ్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు 226 మంది గైర్హాజరు
కరీంనగర్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–1పరీక్షకు 226 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో వి.గంగాధర్ తెలిపారు. జనరల్ విభాగంలో 1,922మందికి 211మంది గైర్హాజరు కాగా, 1,711 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 178మందికి 15మంది గైర్హాజరు కాగా 163మంది పరీక్ష రాశారని తెలిపారు. మొత్తంగా 2,100మందికి 226మంది గైర్హాజరు కాగా 1,874 మంది పరీక్ష రాశారని డీఐఈవో పేర్కొన్నారు.

ఇటుకబట్టీ కార్మికుల స్థితిగతులపై జడ్జి ఆరా