
ఆగ్రహించిన అన్నదాత
● ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన ● జగిత్యాల, రాయికల్‌లో రోడ్డెక్కిన రైతులు ● మెట్‌పల్లిలో ప్యాక్స్ చైర్మన్‌ను నిలదీసిన వైనం
జగిత్యాలరూరల్/మెట్‌పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, మెట్‌పల్లి, రాయికల్ మండలం శ్రీరాంనగర్, సింగరావుపేటలో రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన రైతులు జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులుగా ధాన్యం పోసి నిరీక్షించినా కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ లత, రూరల్ ఎస్సై సదాకర్ రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని తూకం వేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అదేవిధంగా మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని సీఈవో శేఖర్‌ను రైతులు నిలదీశారు. వర్షానికి ధాన్యం నష్టపోయాయని, వెంటనే కొనుగోళ్లు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొద్దిసేపు కేంద్రంలో గందరగోళం ఏర్పడగా సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ కాంతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కొనుగోళ్లలో జాప్యానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు.. రాయికల్ మండలం శ్రీరాంనగర్, సింగరావుపేట గ్రామాల్లో అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జెడ్పీ మాజీచైర్‌పర్సన్ దావ వసంత అక్కడకు చేరుకున్నారు. తడిసిన ధాన్యం పరిశీలించారు. రైతులతో కలిసి అక్కడే బైఠాయించారు. రైతులు ఎంతోకష్టపడి పండించిన ధాన్యం చేతికందే దశలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోళ్లలో జాప్యం జరగడం, అకాల వర్షాలతో తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, నాయకులు చాంద్, రాజేశ్వర్‌రెడ్డి, జలపతిరెడ్డి, గంగారెడ్డి, రాజమౌళి, చంద్రయ్య, శ్రీను, రవి, మల్లారెడ్డి, నరేశ్, లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.