
వానాకాలం.. ‘సాగు’డెట్లా
● రేపటి నుంచే రోహిణి కార్తె ● పూర్తవని రుణమాఫీ.. ● ఖరారు కాని రుణ ప్రణాళిక ● అన్నదాతకు నలుదిక్కులా సమస్యలే
కరీంనగర్ అర్బన్: సకాలంలో పంటలు వేస్తేనే ప్రయోజనమన్నది శాస్త్రవేత్తల మాట. ఈ నెల 25న రోహిణి కార్తెలోకి ప్రవేశమవనుండగా తదనుగుణంగా సిద్ధమవ్వాలనుకునే రైతన్నకు నిర్వేదమే మిగులుతోంది. ప్రభుత్వం కోట్లకు కోట్లు రైతు ప్రయోజనార్థం కేటాయిస్తుంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం గుదిబండలా మారింది. ఎప్పటికప్పుడు అన్నదాతలకు అండగా నిలిచి నిధుల కోసం ప్రతిపాదించాల్సి ఉండగా నిర్లక్ష్యం చేయడం విడ్డూరం. భూగర్బజలాలు పెరగడం.. చెరువుల్లో నీరుండటంతో ఈ సారైనా రోహిణిలో నార్లు పోసుకోవాలనుకునేవారికి చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానకాల సీజన్‌లో 3.43లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయన్నది వ్యవసాయ శాఖ అంచనా.
ఖరారు కాని రుణ ప్రణాళిక
సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు ప్రతిఏటా కొర్రీలతో వేధిస్తుండగా ఈ సారి ఇంకా రుణ ప్రణాళికే ఖరారు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక రుణమాఫీ ఇంకా పరిపూర్ణం కాకపోవడం ఇంకా లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకలవడం విశేషం. గత అయిదేళ్లలో ఎప్పుడు కూడ లక్ష్యం మేర రుణాలిచ్చిన దాఖలాలే లేవు. మంత్రుల సమీక్షలో రుణాలిస్తామని తలలూపడం తప్పా ఆచరణలో అదే నిర్లక్ష్యం. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించగా వడ్డీ కలిపి 2లక్షలు దాటిన రైతులకు ఇంకా మాఫీ చేయలేదు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకున్న బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు దాటవేత ధోరణిని అనుసరిస్తున్నారు.
అవసరం కొండంత.. ఆసరా గోరంత
ఏటా అరకొర విత్తనాలు మాత్రమే సరఫరా అవుతుండగా ప్రధానంగా అవసరమైన వరి విత్తనాలను ఆశించినస్థాయిలో ఇవ్వడం లేదు. వేరుఽశనగ, కందులు, శనగ, మినుములు, పెసలు ఇతర విత్తనాలు ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా ఇంకా విత్తనాలే రాకపోవడం ఆందోళనకర పరిణామం. ఏటా పంపిణీ చేసే విత్తనాలు క్షేత్రస్థాయి డిమాండ్‌కు ఏ మాత్రం సరిపోవడం లేదు. పరిఽశోధన స్థానాలు గానీ విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాల నిల్వలపై ప్రచారం లేకపోవడం శోచనీయం.
రైతు భరోసా ఏదీ.. పంట డబ్బులేవీ
అన్నదాతకు ఆర్థిక భరోసాగా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుండగా ఇంకా అతీగతి లేదు. వానకాలం సీజన్‌కు గానూ ఎకరాకు రూ.6వేలు ఇస్తుండగా సదరు ప్రక్రియ మొదలు కాలే. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వానా కాలం రైతు భరోసా రైతు ఖాతాకు చేరకపోగా యాసంగిలోనూ అదే పరిస్థితి. యాసంగిలో కేవలం 4ఎకరాలలోపు రైతులకు మాత్రమే జమ కాగా మిగతా రైతులు ఇంకా పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌కు రూ.171కోట్లు జమ కావాల్సి ఉండగా కాలయాపనే. చిన్న, సన్నకారు రైతులకే రైతు భరోసా జమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే నగదు ఖాతాకు చేరుతుందని ప్రభుత్వం ప్రకటించగా క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ పరిస్థితి. పక్షం రోజులు దాటినా డబ్బులు పడటం లేదని రైతులు వాపోతున్నారు. ఽజిల్లాలో రూ.40కోట్ల వరకు రైతుల ఖాతాకు చేరాల్సి ఉంది.
పెద్ద రైతులకు లేనట్టేనా
ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు పథకం పెద్ద రైతులకు లేనట్టేనని స్పష్టమవుతోంది. 2018 వానకాలం సీజన్‌లో రైతు బంధు పథకం ప్రారంభం కాగా వానకాలం, యాసంగి రెండు సీజన్లు పెద్ద రైతులకు రైతు బంధు సాయం అందింది. 2019 నుంచి అంటే రెండు సీజన్లు డబ్బులు రాలేదు. 2019 వానకాలం సీజన్‌లో 1,61,653 మంది రైతులకు గానూ రూ.171.65కోట్లు చేరాల్సి ఉండగా 1,47,592 మందికి రూ.150కోట్లు విడుదల చేశారు. ఈ లెక్కన రూ.21కోట్లు పెద్దరైతుల ఖాతాకు చేరలేదు. అలాగే యాసంగిలో 1,14,102మందికి రూ.100.48కోట్లు మాత్రమే రైతుల ఖాతాకు జమయ్యాయి. ఇక 2024 వానకాలం డబ్బులు ఎవరికి పడకపోగా యాసంగికి సంబంధించి 4ఎకరాల వరకే నగదు జమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి అంతే. ఏడాదికి మూడు విడతలుగా రూ.2వేల చొప్పున జమ చేస్తుండగా రైతుల సంఖ్య తగ్గుతోంది. మొదటి విడతలో 1.02లక్షల మంది ఉన్న రైతుల సంఖ్య మూడో విడతలో 95,100కు చేరగా తాజాగా 69,173 మందికి సాయమందింది.