కోట్ల దందా! | - | Sakshi
Sakshi News home page

కోట్ల దందా!

May 20 2025 12:14 AM | Updated on May 20 2025 12:14 AM

కోట్ల

కోట్ల దందా!

మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025
వందల పట్టాలు
● కొత్తపల్లి మండలంలో 20 ఎకరాల సీలింగ్‌ ల్యాండ్‌ ● 30 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌ ● ఆర్డీవో హెచ్చరించినా స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ ● లోకాయుక్త ఆదేశాలతో కదిలిన కరీంనగర్‌ కలెక్టర్‌ ● సీలింగ్‌ భూముల్లో 460 పట్టాల రద్దుకు ఆదేశాలు ● ఇప్పటికే చేతులు మారిన రూ.వందల కోట్లు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 460 పట్టాలు కలెక్టర్‌ ఆదేశాలతో రద్దుకానున్నాయి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలోని 20 ఎకరాల సీలింగ్‌ ల్యాండ్‌లో ఇంతవరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలన్న లోకాయుక్త ఆదేశాలను కలెక్టర్‌ పమేలా సత్పతి అమలు చేశారు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండరాదన్న లోకాయుక్త ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. దీంతో రూ.వందల కోట్ల మేర ఇప్పటికే పలువురు చేతులు మారిన ఈ భూములు త్వరలో ప్రభుత్వ పరం కానున్నాయి. ఇప్పటికే అనేక అవినీ తి ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖకు ఇది చెరపలేని మరకే కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వాకానికి ఆ స్థలంలో భూములు కొన్న అమాయకులు రోడ్డునపడే దుస్థితికి తీసుకువచ్చింది.

అసలేం జరిగింది?

కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175,197,198 సర్వే నంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995లో ఈ భూములు దుర్విని యోగం అవుతున్నాయని, విచారణ జరపాలని అప్పటి హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ చేసిన కలెక్టర్‌ ఆ భూములు సీలింగ్‌ పరిధిలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి లావాదేవీలు చేయరాదని ఆదేశించారు. కలెక్టర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ భూముల్లో అక్రమ లావాదేవీలు మాత్రం ఆగలేదు. అప్పట్లో దివంగత లోక్‌సత్తా శ్రీనివాస్‌ ఈ భూముల పరిరక్షణకు పోరాటం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ లోక్‌సత్తాను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన లోక్‌సత్తా సర్వే నంబర్లు 175,197,198లో జరిగిన లావాదేవీలు సమర్పించాలని రెవెన్యూశాఖను ఆదేశించింది. దీంతో ఆ వివరాలను రెవెన్యూ అధికారులు సమర్పించారు. అంతేకాకుండా ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని రెవెన్యూ శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖను 1998 నుంచి 2023 వరకు మొత్తం ఎనిమిది సార్లు ఆదేశించినట్లు సమాచారం. అయితే, కరోనా సమయంలో ఈ వ్యవహారంపై పోరాటం చేస్తున్న లోక్‌సత్తా శ్రీనివాస్‌ మరణించడంతో కేసు నీరుగారిందనుకున్న పలువురు ఆ భూముల్లో తిరిగి రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించారు. రెవెన్యూశాఖ ఆదేశాలను ధిక్కరిస్తూ.. కొందరు అవినీతి అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం ఆరంభించారు. తీరా గతేడాది నవంబరులో లోకాయుక్త మూడు సర్వే నంబర్లలో ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆర్డీవో మహేశ్వర్‌ను ఆదేశించింది. వెంటనే ఆయా రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు ఆర్డీవో లేఖ రాశారు. అయినా, ఆయన ఆదేశాలను షరా మామూలుగానే పక్కనబెట్టింది రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ విషయాన్ని ఆర్డీవో లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్‌ అధికారుల తీరుపై మండిపడ్డ లోకాయుక్త పట్టాలను రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ పమేలా సత్పతి.. వివాదాస్పద సర్వే నంబర్లు 175,197,198లో పట్టాలు రద్దు చేయాలని డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. దీంతో మూడు సర్వే నంబర్లలో జరిగిన దాదాపు 460 రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. కాగా, అసలు విషయం తెలియక ఎన్నో ఆశలతో ఈ మూడు సర్వే నంబర్లలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన మధ్య తరగతి వారంతా లబోదిబోమంటున్నారు. తమను రోడ్డున పడేమొద్దని ప్రాధేయపడుతున్నారు.

న్యూస్‌రీల్‌

సామాన్యుల గురించి ఆలోచించాలి

కొత్తపల్లిలోని 175,197,198 సర్వే నంబర్లలో భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు నిర్ణయాన్ని కలెక్టర్‌ పునరాలోచించాలి. అనేక సామాన్య కుటుంబాలు తెలియక కొనుగోలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కొన్న సామాన్యుల గురించి ఆలోచించాలి. ఎలాంటి నోటీసులివ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి సామాన్యులకు న్యాయం చేయాలి.

– రాజగోపాల్‌రెడ్డి, ప్లాట్‌ యజమాని

పట్టా ఆధారంగా కొనుగోలు

పట్టాదారు పహానిలో 175,197,198 నంబర్లు ఉండటం వల్లే చాలా మంది కొనుగోలు చేశారు. 1983 సీలింగ్‌ యాక్టు ప్రకారం ప్రభుత్వం ఆ భూములను బ్లాక్‌లిస్టులో పెడితే ఎవరూ కూడా కొనేవారు కాదు. సీలింగ్‌ భూమి అని ఎక్కడా పేర్కొనక పోగా, ఆ భూములకు పరిహారం కూడా ఇవ్వలేదు. దీంతో అనేక క్రయవిక్రయాలు జరిగాయి. ప్లాట్లు కొన్న సామాన్యులకు వ్యతిరేకంగా తీర్పు రావడం ఆందోళన కలిగిస్తోంది.

– బబ్లూ వర్మ, రియల్‌ వ్యాపారి

సమాచారం లేదు

కొత్తపల్లిలోని పలు సర్వే నంబర్లు ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ కింద ఉన్నాయని వీటిని ప్రోహిబిటెడ్‌ లిస్టులో చేర్చాలని మాకు ఆరునెలల క్రితం ఆర్డీవో నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే సంబంధిత సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్‌ లిస్టులో చేర్చాం. అప్పటి నుంచి ఈ మూడు సర్వే నంబర్లలో ఎలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాలేదు. మళ్లీ ఇటీవల కలెక్టర్‌ గారి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలను సైతం గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపించాం.

– ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్‌

డాక్యుమెంట్లు రద్దు చేస్తాం

కొత్తపల్లి మండలంలో ల్యాండ్‌ సీలింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రెండురోజుల క్రితం కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 460కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అధికారుల సూచనలు పాటించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం. – అఫ్జల్‌ఖాన్‌,

సబ్‌ రిజిస్ట్రార్‌, గంగాధర

కోట్ల దందా!1
1/1

కోట్ల దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement