అమ్మా.. నాన్న.. కన్నా.. | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాన్న.. కన్నా..

May 19 2025 2:15 AM | Updated on May 19 2025 2:15 AM

అమ్మా

అమ్మా.. నాన్న.. కన్నా..

జీవనశైలిలో మార్పు రావాలి

వివాహాలు ఆలస్యంగా జరుగుతుండడం వల్ల అప్పటికే ఊబకాయం, వృత్తిపరమైన మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్‌ వస్తున్నాయి. మహిళల్లో పీసీవోడీ సమస్యలు పెరుగుతున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ ఫెర్టిలిటీ సామర్థ్యం తగ్గుతుంది. సాధారణంగా మహిళలకు 20–35 ఏళ్ల మధ్య గర్భం ధరించడం మంచిదిగా భావిస్తారు. మహిళల్లో థైరాయిడ్‌ సమస్యలు, హార్మోన్స్‌ అసమతుల్యతలు ఉంటే చికిత్స చేయించుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మద్యం, డ్రగ్స్‌ పూర్తిగా మానాలి. పిల్లలు పుట్టాలంటే దంపతులు జీవ న విధానంలో మార్పులు చేసుకోవాలి. గర్భం రావడానికి మానసికంగా ఆందోళన లేకుండా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. అందుకోసం యోగా, వ్యాయామం చేయాలి.

– డాక్టర్‌ ఎనమల్ల శ్రీదేవి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు

కరీంనగర్‌టౌన్‌: నూతన జీవితం ప్రారంభించిన తర్వాత ‘అమ్మా నాన్న’ అనే మధుర పిలుపును వినాలనే కోరిక ప్రతి జంటలోనూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది దంపతులు ఈ ఆనందాన్ని అనుభవించలేక సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి సమస్యకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. దంపతులు తమ స్వయంకృతాపరాధంతో చేసే పనులతోనే సమస్యను మరింత జఠిలం చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆలస్యంగా వివాహాలు చేసుకుని సంతానం లేక బాధ పడుతుండగా.. మరి కొందరిలో ఊబకాయ సమస్య సంతానానికి ప్రధాన అవరోధం అవుతోంది. కారణాలేవైనా మానసిక, శారీరక దృఢత్వం, సంతోషకరమైన జీవన విధానమే సంతాన సాఫల్యానికి మూలం అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సంతాన లేమితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీంతో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల వంటి పట్టణాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు విరివిగా వెలుస్తున్నాయి.

సాంకేతికత అందుబాటులోకి వచ్చినా..

ఓ వైపు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వల్ల ఐవీఎఫ్‌, ఐయూఐ వంటి చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా.. మానసిక, సమాజపు ఒత్తిళ్లు సంతానలేమితో బాధపడుతున్న వారిని కలతకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఆరోగ్య పరీక్షల ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సంతాన ఆశను సాకారం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఉరుకులు పరుగుల జీవనశైలి, బాగా సంపాదించి సెటిల్‌ కావాలనే ఆశతో కొంతమంది పిల్లల్ని కనాలనే ఆలోచన కూడా మరిచిపోతున్నారని, వయస్సు పెరిగితే పిల్లలు కనడం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ఫెర్టిలిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫెర్టిలిటీ సెంటర్లకు క్యూ..

పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో దంపతులు ఫెర్టిలిటీ సెంటర్‌లకు క్యూ కడుతున్నారు. కొంత మంది ఫలితం పొందుతుండగా, మరికొంత మంది లక్షలు కుమ్మరించినా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం మనదేశంలో వివాహితులలో సుమారు 15–20 శాతం జంటలు గర్భధారణ సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సంతానలేమికి దారితీసే అలవాట్లు

మద్యపానం, ధూమపానం చేసే వారిలో అండాలు, శుక్రకణాలు విడుదల కాకపోవడం, నాణ్యత లోపించడం వంటివి జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో వైపు ఇటీవల కాలంలో జీవితంలో స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలనే ఆలోచన అనేక మందిలో పెరిగింది. దీంతో 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. ఇది కూడా సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. మల్టీ టాస్కింగ్‌, తక్కువ నిద్ర వంటి కారణాలు సంతాన లభ్యతను తగ్గిస్తున్నాయి.

జీవనశైలి మార్పులు : ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, పనిబాధ్యతలు, రాత్రివేళ పని, ఊబకాయం వంటివి హార్మోన్ల అసమతుల్య తకు దారితీస్తున్నాయి.

ఆహారపు అలవాట్లు : ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ అధికంగా తీసుకోవడం కూడా ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోంది.

ఫెస్టిసైడ్స్‌ ప్రభావం : ఇక పురుగు మందులు వాడిన ఆహార పదార్థాలు, కాలుష్యం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, క్రమపద్ధతిలేని భోజనం జంక్‌ఫుడ్‌, ల్యాప్‌టాప్‌ వంటివి అతిగా వాడడం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు సైతం సంతాన లేమికి దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దుస్తులు : బిగుతు దుస్తులు కూడా సంతాన లేమికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. టైట్‌గా ఉండే జీన్స్‌ప్యాంట్లు, లోదుస్తులు కూడా తరుచూ వేసుకోవద్దని సూచిస్తున్నారు.

అమ్మా.. నాన్న.. కన్నా..1
1/3

అమ్మా.. నాన్న.. కన్నా..

అమ్మా.. నాన్న.. కన్నా..2
2/3

అమ్మా.. నాన్న.. కన్నా..

అమ్మా.. నాన్న.. కన్నా..3
3/3

అమ్మా.. నాన్న.. కన్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement