
ప్రతీరోజు వీధి దీపాలు వెలగాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని సెంట్రల్ లైటింగ్‌తో పాటు, అన్ని వీధి దీపాలు ప్రతీ రోజు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో అధికా రులతో రివ్యూ నిర్వహించారు. సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఆధునీకరణ, ఆన్‌లైన్ నల్లా టాక్స్, వీధి దీపాల మరమ్మతు, వాహనాల కొనుగోలు, సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. వీధిదీపాల నిర్వహణపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని తనిఖీ చేయాలని, వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయించాలన్నారు. నగరంలోని సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) ఆధునీకరణకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని తెలిపారు. వెంటనే ఎస్‌టీపీ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆన్‌లైన్‌లో నల్లా పన్నులు వసూలు చేయాలన్నారు. ఇప్పటి వరకు మాన్యువల్‌గా వసూలుచేసిన రసీదు బుక్‌లను నగరపాలక సంస్థకు అప్పగించాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన డిజిటల్ లైబ్రరీ, కాశ్మీర్ గడ్డ రైతు బజార్, బాలసదన్‌భవన్, ఐసీసీసీ తదితర పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశం ఈఈలు యాదగిరి, సంజీవ్, డీఈ లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, శ్రీనివాస్ రావు, ఏఈ సతీష్ కుమార్, గట్టు స్వామి పాల్గొన్నారు.
నీటి సరఫరాలో నిర్లక్ష్యం
● బల్దియా తీరుతో భగత్‌నగర్ వాసుల బేజార్
కరీంనగర్ కార్పొరేషన్: అసలే ఎండాకాలం...ఆపై నీటి వినియోగం అధికం...సాధారణ పరిస్థితులకు మించి నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేయాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నీటి సరఫరాలో అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా సిటీలోని కొన్నిప్రాంతాలకు చెందిన వారు కృత్రిమ నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఎల్‌ఎండీలో సరిపడా నీటి మట్టం ఉన్నప్పటికీ.. చిన్నచిన్న సాంకేతిక సమస్యల కారణంగా ప్రజల గొంతు ఎండుతోంది. ముఖ్యంగా భగత్‌నగర్ రిజర్వాయర్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. భగత్‌నగర్ రిజర్వాయర్ నుంచి భగత్‌నగర్, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోంది. రిజర్వాయర్‌కు వచ్చే నీళ్లను సంప్ ద్వారా ట్యాంక్‌లో నింపుతారు. ట్యాంక్ నుంచి రిజర్వాయర్ పరిధిలోని కాలనీలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. వేసవికాలం కావడంతో నగరంలో ప్రతీ రోజు తాగునీటి సరఫరా కాస్తా, రోజు విడిచి రోజుగా మారడం తెలిసిందే. రోజు విడిచి రోజు నీటి సరఫరా కావడంతో సహజంగానే నల్లా నీళ్ల కోసం కాలనీ వాసులు ఎదురు చూడాల్సి వస్తోంది. కాగా కొద్దికాలంగా సంప్, ట్యాంక్ ద్వారా కాకుండా నేరుగా పైప్‌లైన్‌తోనే నీటిసరఫరా చేస్తున్నారు. వాల్వ్ చెడిపోయిందనే కారణంతో ట్యాంక్‌కు నీటిని ఎక్కించకుండా, నేరుగా పైప్‌లైన్‌తోనే ఇండ్లకు సరఫరా జరుగుతోంది. దీంతో సహజంగానే నీటి ఫ్రెషర్ ఉండకపోవడంతో, రిజర్వాయర్ పరిధిలోని చివరి ప్రాంతాలకు నీళ్లు వెళ్లడం లేదు. తగిన ప్రెషర్ ఉండడం లేదు. దీంతో భగత్‌నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల వాసులు కృత్రిమ నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు డివిజన్‌ల వాసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
రైతుల ఖాతాలో రూ.382 కోట్లు జమ●
కరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు వసతులను కల్పిస్తుండగా కొనుగోళ్ల వేగం పెంచింది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా విభాగాల ద్వారా 343 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా 1,64,879 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకాలు 1,47,592 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 17,287 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. గతానికి కన్నా 11,552 మెట్రిక్ టన్నులను అధికంగా కొనుగోలు చేసింది. 24,575 మంది రైతుల నుంచి కొనుగోలు చేయగా రూ.382 కోట్లు వారి ఖాతాలో జమయ్యాయి. ఇక సన్నరకాల వడ్ల బోనస్ విలువ రూ.8.64కోట్లు కాగా రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదర్శ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల క్రమంలో 16 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లు కేటాయించారు. సదరు పరికరం వల్ల తాలు, తప్పా, ఇతర వ్యర్థాలను తొలగించవచ్చు. గోనె సంచుల కొరత లేకుండా చర్యలు చేపడుతుండగా టార్పాలిన్లను కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూంఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 9154249727 ఏర్పాటు చేశారు. దీంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ వివరించారు.