
లక్ష్మీదేవిపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటస్వామి
సారంగాపూర్(జగిత్యాల): ఓటర్లను మభ్యపెట్టి, తాయిళాలు ఇచ్చి, ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్సీ వెంకటస్వామి హెచ్చరించారు. సారంగాపూర్ మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ.. ఎవరైనా ఎన్నికల నియమావళిని ధిక్కరించేలా వ్యవహరిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఓటర్లకు మద్యం, డబ్బులు, వస్తువులు పంపిణీ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులను తీసుకెళ్తే సంబంధిత పత్రాలు చూపించాలన్నారు. లేకపోతే వాటిని సీజ్ చేసి, ఎన్నికల టీంకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. సారంగాపూర్ ఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది ఉన్నారు.