కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: పీఎంజేజేబీవై, ఎస్‌బీవై, ఏపీవై వంటి బీమాలపై అవగాహన కల్పించి అందరికీ బీమా చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లు, అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి తక్కువ ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉన్న పీఎం బీమా యోజనపట్ల అవగాహన కల్పించాలన్నారు. 17 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అర్హత ఉన్న ఈ ప్రీమియం వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధానమంత్రి సూరజ్ ఘర్ ముక్త్ బిజిలీ యోజన కార్యక్రమంలో భాగంగా ఒక రెవెన్యూ గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేయాలన్నారు. 5వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి, ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి సోలార్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ పదోతరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు.
భూభారతిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులందరికీ నోటీసులు జారీచేసి పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
నగర సమస్యలపై పట్టింపేది?
● 15 రోజుల్లో పరిష్కరించాలి
● లేదంటే బల్దియా ముట్టడి
● మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజల సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు పట్టింపులేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పదిహేనురోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే బల్దియాను ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లతో కలిసి నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసంపూర్తిగా ఉన్న 65 పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. షైనింగ్ కరీంనగర్‌ను అంధకారం చేశారన్నారు. 40 శాతం లైట్లు వెలగడం లేదని, వాటిని మార్చేవాళ్లే లేరన్నారు. జంక్షన్లను గాలికి వదిలివేశారని, వాటర్‌లేదు, ఫౌంటెన్‌లేదన్నారు. మూడు రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు.
స్వీపింగ్ మిషన్‌లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వర్షాకాలం దోమలు పెరిగిపోతాయని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగించాలన్నారు. డంప్‌యార్డ్ సమస్యను పరిష్కరించేలా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చర్యలు చేపట్టాలన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే బల్దియాను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, సుధగోని మాధవి, రుద్ర రాజు, బండారి వేణు, ఎడ్ల అశోక్, జంగిలి ఐలెందర్‌యాదవ్, కోల సంపత్, జంగిలి సాగర్, తోట రాములు, మర్రి సతీశ్, నాంపల్లి శ్రీనివాస్, బోనాల శ్రీకాంత్, కుర్ర తిరుపతి, దిండిగాల మహేశ్, బాలయ్య, సంపత్‌రావు పాల్గొన్నారు.
సాగులో మెలకువలపై నేడు శిక్షణ
కరీంనగర్ అర్బన్: రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు చిరుధాన్యాల సాగులో మెలకువలపై వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో కార్యక్రమం జరగనుండగా శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులందరూ సమీప రైతు వేదికల్లో సకాలంలో హాజరుకావాలని సూచించారు.

అందరికీ పీఎం బీమా చేయించండి