
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● స్కానింగ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్ ● జూన్‌లో 8 సెంటర్లకు నోటీసులు
కరీంనగర్‌టౌన్: స్కానింగ్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అయినా కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్యులు కలిసి స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలుసుకొని గుట్టుచప్పుడు కాకుండా కానరాని లోకాలకు పంపుతున్నారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండి ఆదాయం లేని కొన్ని నర్సింగ్ హోంలు, పెర్టిలిటీ కేంద్రాల్లో ఎవరికీ అనుమానం రాకుండా జరుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేటు ప్రాక్టీషనర్లు మధ్యవర్తులుగా ఉండి ఆడపిల్లలకు మరణ శాసనం లిఖిస్తున్నారు.
అడ్వయిజరీ కమిటీ సమావేశం
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర వెంకటరమణ అన్నారు. సోమవారం డీఎంహెచ్‌వో చాంబర్లో జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును సమీక్షించారు.
8 సెంటర్లకు నోటీసులు
గతనెలలో లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 8 స్కానింగ్ సెంటర్లకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్లు గర్భంలోని పిండం ఆడ లేదా మగ శిశువు అని తెలపడం చట్టరీత్యా నేరం. 3 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.50,000 వరకు జరిమానా విధిస్తారు.
తనిఖీలు..
వైద్యారోగ్య శాఖ జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటి హోంలు, ఫెర్టిలిటీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో తనిఖీలు చేపట్టనున్నారు.
అక్రమాలకు పాల్పడితే సీజ్
నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. గడువు ప్రకారం సమాధానం చెప్పకుంటే వాటిని సీజ్ చేస్తాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు మధ్యవర్తులుగా లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – వెంకటరమణ, డీఎంహెచ్‌వో