
కొసరి కొసరి వడ్డింపు
కార్పొరేషన్ కహానీ–2
● గత కమిషనర్ హయాంలో కాంట్రాక్టర్లపై దయ ● టెండరు లేకుండా పనులు.. అంతకు ముందే బిల్లులు ● సమాచార హక్కుతో నిలిచిన రూ.40లక్షల చెల్లింపులు ● గరుడ జంక్షన్‌పై మరోసారి స.హ.చట్టం దరఖాస్తు ● అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీకి మాజీ మేయర్ ఫిర్యాదు ● కొత్త కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌పై గంపెడాశలతో సిబ్బంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ నగరపాలక సంస్థలో మొన్నటి వరకు పరిపాలన అస్తవ్యస్తంగా సాగింది. గత కమిషనర్ హయాంలో తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు బల్దియా పరువును పెనం నుంచి పొయ్యిలో పడేశాయి. మరికొన్ని ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూన్నే ఉన్నాయి. అక్రమాలకు అవినీతికి బల్దియా అడ్డాగా మారిందన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాక్షాత్తూ తాజా మాజీ కార్పొరేటర్లే బల్దియాలో అవినీతి జరిగిందని సమాచార హక్కు కింద దరఖాస్తులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండడం బల్దియా దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వచ్చీరాగానే ఎంబీ మాయం ఘటనలో ఏఈ గఫూర్‌ను సస్పెండ్ చేయడంతో మరిన్ని అవినీతి వ్యవహారాలకు చరమగీతం పాడతారని బల్దియా సిబ్బంది, నగరపౌరులు గంపెడాశలతో ఉన్నారు.
ఆర్టీఐ దరఖాస్తుతో నిలిచిన రూ.40 లక్షల చెల్లింపులు
ఇటీవల బొమ్మకల్ ఫ్‌లై ఓవర్ సుందరీకరణ పనులు చేయకముందే కాంట్రాక్టర్‌కు రూ.40లక్షలు చెల్లించేందుకు కమిషనర్ చెక్కుసిద్ధం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ చెక్కు పాస్ కాకుండా ఒక సహచట్టం (ఆర్టీఐ) దరఖాస్తు కావడం గమనార్హం. పనులు చేయకుండానే చెక్కులు ఎలా కాంట్రాక్టరుకు ఇస్తున్నారని సిక్‌వాడీకి చెందిన ఓ పౌరుడు దరఖాస్తు చేయగానే.. విషయం బయటికి పొక్కిందన్న ఆందోళనలో రూ.40 లక్షల చెక్కు జారీ నిలిపివేశారు. అప్పటి వరకు మార్చి 31 గడువు ముగుస్తుందన్న తొందరలో చెక్కు సిద్ధం చేశామంటూ సమర్థించుకున్న కమిషనర్ తరువాత మాత్రం పేమెంట్ వోచర్లు, ఎంబీ రికార్డులు అసలు ప్రిపేర్ చేయలేదని ఆర్టీఐకి లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం.
మాజీ కార్పొరేటర్ల పోరాటం
గత కమిషనర్ హయాంలో జరిగిన అవినీతిపై పలువురు కార్పొరేటర్లు బహిరంగ పోరుకు దిగారు. పద్మనగర్ గరుడ జంక్షన్‌లో రూ.కోటి అంచనాతో ప్రారంభించిన పనులను అదనంగా రూ.80లక్షలకు అదే కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగిస్తారని సమాచార హక్కు ద్వారా బల్దియా కమిషనర్‌ను కోరడం కలకలం రేపుతోంది. ఈ పనులకు సంబంధించి వర్క్‌స్లిప్, డ్రాయింగ్ సమర్పించాలని దరఖాస్తులో కమిషనర్‌ను కోరడం గమనార్హం. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. బొమ్మకల్ ప్రాంతం 2022లో కరీంనగర్ స్మార్ట్‌సిటీలో భాగమే కానప్పుడు అక్కడ స్మార్ట్‌సిటీ నిధులతో పనులు ఎలా చేస్తారు అని నిలదీస్తున్నారు. ఈ నిధుల దుర్వినియోగంలో కేసు నమోదైందని, కరీంనగర్ స్మార్ట్‌సిటీ కమిషనర్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, కరీంనగర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ప్రతినిధి, తదితరులు అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలంను మంగళవారం కోరారు.
ప్రఫుల్ దేశాయ్‌పై ఆశలున్నాయి
జిల్లాలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్‌లు కానరావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు ప్రజాసమస్యలపై వేగంగా స్పందిస్తుంటే కరీంనగర్‌లో ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌పై చాలా ఆశలు ఉన్నాయి. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారిగా మంచి పేరుంది. బల్దియాలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కోడై కూస్తున్న నేపథ్యంలో కమిషనర్ అక్రమార్కులైన అధికారులు, గుత్తేదారులపై కొరఢా ఝుళిపిస్తారని ఆశిస్తున్నాం.
– ఆమెర్, కాంగ్రెస్ నేత

కొసరి కొసరి వడ్డింపు

కొసరి కొసరి వడ్డింపు