
వర్షపునీరు ఎక్కడా నిలవొద్దు
● బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఖాళీ స్థలా లు, రోడ్లపై వర్షంనీరు నిలువకుండ పారిశుధ్య అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, ఎల్‌ఎండీలోని నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో పారిశుధ్య పనులు మెరుగు పరచాలన్నారు. చెత్త కనిపించకుండా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వర్షపునీరు నిలువకుండా డ్రైనేజీల్లోకి మళ్లించాలన్నారు. డ్రైనేజీల్లో సిల్ట్ లేకుండా చూడాలన్నారు. దోమల లార్వా పెరగకుండా నీటి గుంటలను తొలగించాలన్నారు. డివిజన్ల వారీగా దోమలు పెరగకుండా స్ప్రే, ఫాగింగ్ చేయాలని, ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని, నాటేందుకు స్థలాలు గుర్తించి వివరాలు అందించాలన్నారు.