
పైసా లేకుండా వైద్య సేవలు
మానకొండూర్: ప్రభుత్వాస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్‌రూం, మెడికల్ స్టోర్ పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 100శాతం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ సేవల ప్రగతిని తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో బీపీ, షుగర్‌కు మందులు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. మండలకేంద్రంలోని భవత కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ విద్యార్థులతో ఆటలు ఆడారు. కేంద్రానికి ఏమైన అవసరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కేంద్రం ఆవరణలో మొక్క నాటారు. తరువాత గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇల్లు వేగంగా పూర్తి చేయాలని, దశలవారీగా సొమ్ము జమ చేయిస్తామని సూచించారు. నర్సరీని పరిశీలించి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పండ్లు, పూలమొక్కలు పెంచాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, మండల విద్యాధికారి మధుసూదనాచా రి, భవిత కేంద్రం సిబ్బంది ఉమ, రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై విస్తృత ప్రచారం చేయాలి
కలెక్టర్ పమేలా సత్పతి