
ఖర్గే సభకు తరలిరావాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే బహిరంగసభకు కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సమన్వయకర్త ఫక్రుద్దీన్ కోరారు. ఇందిరాభవన్‌లో మంగళవారం జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ బాధ్యులు, కార్యకర్తలు, ఇటీవల పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీఒక్కరు తరలిరావాలన్నారు. త్వరలో మై నార్టీలకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నా యకులకు ఇందిరమ్మఇళ్ల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడికి ఇల్లు ఇస్తే, జీర్ణించుకోలేని మాజీ ఎమ్మె ల్యే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నా రు. కాగా సమావేశం జరుగుతుండగా, కొంతమంది కరీంనగర్ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నిలదీసే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఆడెం రాజు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, వైద్యుల అంజన్‌కుమార్ కర్ర సత్యప్రసన్నరెడ్డి పాల్గొన్నారు.
వనమహోత్సవానికి సిద్ధం కండి
జమ్మికుంట రూరల్: వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే వనమహోత్సవం, వెబ్‌సైట్‌లో మార్పులపై జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రతీ ఒక్కరు చేరుకోవాలన్నారు. ఏడీపీ కృష్ణ, ఎంపీడీవోలు భీమేశ్, శ్రీధర్, పుల్లుయ్య, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సోషల్ వెల్ఫేర్ పాఠశాల సందర్శన
జమ్మికుంట: పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలను జిల్లా మలేరియా అధికారి ఉమాశ్రీరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు మంగళవారం సందర్శించారు. వసతి గృహంలోని వాటర్‌ప్లాంట్, వంటగదిని పరిశీలించారు. వాటర్ ప్లాంట్ లీకేజీ లేకుండా, వంటగదిలోకి ఈగలు, దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బయటి నుంచి తినుబండారాలు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వర్షాకాలంలో వ్యాపించే డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, మెదడువాపు, అతిసారం, టైఫాయిడ్, జాండీస్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 32 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జ్వరంతో బాధపడుతున్న నలుగురి రక్త నమూనాలు సేకరించారు. ప్రిన్సిపాల్ లచ్చయ్య, డాక్టర్లు రాజేశ్, మహోన్నత పటేల్ పాల్గొన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు 11 కేవీ చెర్లభూత్కుర్ ఫీడర్, ఇరుకుల్ల ఫీడర్‌లో చెర్లభూత్కూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ క్రిస్టియన్ కాలనీ ఫీడర్, 11కేవీ సివిల్ ఆసుపత్రి ఫీడర్ 33/11 కేవీ ఎస్‌ఎస్ వావిలాలపల్లిలో ఫీడర్‌లో సవరన్ స్ట్రీట్ ఏరియా, ఎస్‌వీజేసీ కళాశాల, రామాలయం, ప్రశాంత్‌నగర్, రాణి ఆసుపత్రి, జానకి చికెన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు.

ఖర్గే సభకు తరలిరావాలి

ఖర్గే సభకు తరలిరావాలి