
పల్లెల్లో స్థానిక సందడి
● పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సమాయత్తం ● హైకోర్టు ఆదేశాలతో మొదలైన కదలిక ● రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు 90 రోజుల్లో నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న ఆశావహులతో పాటు ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు. ఈనెల 30లోగా బీసీ రిజర్వేషన్ల ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ అవకాశముంది. ఎన్నికల ప్ర క్రియను ప్రారంభించేలా అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశనం చేసింది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. తరువాత పంచా యతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవ ల పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలా న్ని చేకూరుస్తున్నాయి. ఈ మేరకు ఓటరు జాబి తా సవరణలో అధికారులు నిమగ్నమయ్యారు.
మొదలైన హంగామా
హైకోర్టు ఆదేశాలతో బరిలో నిలిచే ఆశావహులు హంగామా మొదలు పెట్టారు. గ్రామాల్లో యువతను, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఇప్పటి నుంచే మౌత్‌టాక్ ప్రజల్లోకి వెళ్లేలా అనుచరులను సమాయత్తం చేస్తున్నారు. గ్రామాలు, వార్డులవారీగా అర్హులు, సమర్థులు ఎవరన్నదానిపై ప్రధాన పార్టీల లీడర్లు అంచనాకు వస్తున్నారు.
మూడు విడతల్లో
జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతల్లో కరీంనగర్, హుజూ రాబాద్ డివిజన్లవారీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 318 గ్రామపంచాయతీలు, 2,962 వార్డులు, 170 ఎంపీటీసీస్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 200లోపు ఓట్లున్న పోలింగ్ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, 200నుంచి 400 ఓట్లున్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 650 పైన ఓట్లున్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారులు, ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. 650 ఓట్లు పైన గ్రామాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గతంలోనే సూచించింది. దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
రిజర్వేషన్లపైనే దృష్టి
రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ ఉండేలా గత ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో మళ్లీ కొత్తగా పంచాయతీరాజ్ చట్టం–2024 బిల్లును ఆమోదించారు. దీని ప్రకారం ఎన్నికల్లో ఒకసారి మాత్రమే రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని స్థానాలకు రిజర్వేషన్లు మారనుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చిన నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. జనాభా, పోలింగ్‌స్టేషన్లు మ్యాపింగ్ చేశాం’. అని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ వివరించారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు 10,82,751
మహిళలు 5,30,337
పురుషులు 5,52,353
ఇతరులు 61
గ్రామపంచాయతీలు 318
వార్డులు 2,962
జెడ్పీటీసీ స్థానాలు 15
ఎంపీటీసీలు 170
పోలింగ్ కేంద్రాలు 2,962