
ఒక్క ఇల్లూ రాకపాయే
● నగరంలో జాడ లేని ‘ఇందిరమ్మ’ ● కమిటీలు లేక నిలిచిన ఎంపిక ● లబ్ధిదారులుగా మారని అర్హులు ● త్వరలో ప్రకటిస్తామన్న డీసీసీ ప్రెసిడెంట్
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రమంతా ఇందిరమ్మ ఇండ్ల హడావుడి కొనసాగుతుండగా, నగరంలో ఆ జాడే లేకుండా పోయింది. ఇప్పటివరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు అర్హుల జాబితా సిద్ధం చేసి ఉంచినా, కమిటీలు లేక అధికారిక ముద్ర పడడం లేదు. కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, త్వరలో కమిటీలు వేసి, ఇండ్లు ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు.
అర్హుల జాబితా రెడీ
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హుల జాబితాను నగరపాలకసంస్థ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. నగరంలోని 66 డివిజన్ల నుంచి 40,773 దరఖాస్తులు వచ్చాయి. 12,491 దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించారు. ఎల్–2లో (స్థలం, ఇళ్లు లేని) 25,978దరఖాస్తులు ఉండగా, ఎల్–1లో (స్థలం ఉండి, ఇళ్లు లేని) 2,304 దరఖాస్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎల్–1 దరఖాస్తుదారులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం తెలిసిందే. నగరానికి మొదటివిడతలో 1,737 ఇండ్లు మంజూరయ్యాయి. విచారణ చేసిన నగరపాలకసంస్థ అధికారులు 1,567 మందిని అర్హులుగా గుర్తించి కలెక్టర్‌కు జాబితా పంపించారు. ఇంకా 170మంది అర్హులను గుర్తించాల్సి ఉంది.
చేతులు కలవక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై దృష్టి సారించడం తెలిసిందే. దరఖాస్తుదారుల్లో అర్హులను అధికారులు గుర్తిస్తే, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇందిరమ్మ కమిటీలు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించారు. డివిజన్లవారీగా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆ కమిటీలు ఇన్‌చార్జీ మంత్రి ద్వారా అధికారులకు జాబితాను అందిచాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల మూలంగా కమిటీల ఏర్పాటు ఇప్పటివరకు జరగలేదు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో, కరీంనగర్ నుంచి అప్పటి నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ద్వారా రెండు జాబితాలు వేర్వేరుగా వెళ్లాయి. దీంతో ఏ జాబితా ఆమోదించాలో తెలియని పరిస్థితిల్లో ఆమోద ముద్ర పడలేదు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు లేదు.
ఇందిరమ్మ జాడ లేని కరీంనగర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొదటి విడుత ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, రూ.లక్ష కూడా ఖాతాల్లో పడే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్‌లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కాగితాలను దాటి రావడం లేదు. అధికారులు జాబితా రూపొందించినా, కేవలం ఇందిరమ్మ కమిటీలు లేకపోవడంతో అర్హులు లబ్ధిదారులుగా మారడం లేదు. దీంతో కమిటీలతో సంబంధం లేకుండా ఉన్నతాధికారులే నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేసే అంశంపైనా దృష్టిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
త్వరలో కమిటీలు
కరీంనగర్‌లో త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటవుతాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ నుంచి రెండు జాబితాలు పంపించడం వాస్తవమేనని అంగీకరించారు. ఇన్‌చార్జిఇ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనారోగ్య, ఇతరత్రా సమస్యల వల్ల పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారన్నారు. తన మానకొండూరు నియోజకవర్గంలోకి వచ్చే సదాశివపల్లి, అలుగునూరులో ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేసి, నగరంలోనూ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు.
నగరపాలకసంస్థలో డివిజన్లు 66
మంజూరైన ఇండ్లు 1,737
ఎంపిక చేసిన అర్హులు 1,567