అయ్యో.. నాగలక్ష్మి.. ఇలా చేశావేంటి?

intermediate student committed suicide in karimnagar district - Sakshi

కరీంనగర్: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బాగా రాయలేకపోయాననే మనస్తాపంతో కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య – నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి. మల్యాల మండలం నూకపెల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం మల్యాలలో బోటనీ పరీక్ష రాసింది. అయితే, పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది.

ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పింది. పరీక్ష మంచిగారాసి ఉగాది పండుగకు ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలో మంగళవారం బాలిక ఇంటికి చేరుకుంది. వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముదావహంగా ఉంటోంది. భోజనం కూడా సరిగా చేయడంలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా, తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెలిపింది. ఏం ఫర్వాలేదని, ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు బాలికకు సూచించారు. ఈక్రమంలో బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటి ఎదుట వాకిట్లో ముగ్గులు వేసిన నాగలక్ష్మి.. ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఆమె కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. బంధువులకు సమాచారం అందించారు.

ఎక్కడా ఆచూకీ లభించలేదు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు వారికి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లి చూడగా, గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో నీటిలో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు తెలిపారు. కొడుకులు లేకున్నా.. ఇద్దరు కూతుళ్లే సర్వస్వం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నకూతురు మృతితో విషాదంలో మునిగారు.

మరిన్ని వార్తలు :

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top