కాంగ్రెస్‌లో కొట్లాట!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు నిరాకరణతో నెలకొన్న అసంతృప్తి బహిరంగంగా బయటపడింది. డీసీసీ అధ్యక్షుడి ఇంటి వద్దే జరిగిన తోపులాట ఘటన కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ (మార్షల్) తన భార్య శ్రీలతతో కలిసి టికెట్ కేటాయింపు విషయమై నగరంలోని సీతారాంపూర్‌లోని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లారు. డీసీసీ అధ్యక్షుడితో చర్చలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. టికెట్ తనకు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇది అన్యాయమంటూ మార్షల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పి మార్షల్.. వెలిచాల రాజేందర్‌రావు మధ్య తోపులాటకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం పార్టీ శ్రేణులను ఇబ్బందికి గురిచేసింది. అక్కడున్న కాంగ్రెస్ నేతలు వెంటనే జోక్యం చేసుకుని ఇరువురిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ ఘటన కరీంనగర్ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపుపై ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఎన్నికల వేళ ఈ తరహా పరిణామాలు పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాల్సిన అంశంగా మారింది.
‘దమ్ముంటే నా రాజీనామా ఆమోదింపచెయ్’
తనకు టికెట్ రాకుండా చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు దమ్ముంటే తన రాజీనామాను ఆమోదింపచేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, పార్టీని నమ్ముకొని ఉన్న తనకు కాకుండా, బీఆర్‌ఎస్ నుంచి పెద్దపల్లి రవీందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొని టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీని కరీంనగర్‌లో అధికారంలోకి రానీయకుండానే వెలిచాల కుట్ర పన్నారని ఆరోపించారు. తన యూత్‌కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని, వెలిచాలకు దమ్ముంటే రాజీనామాను ఆమోదింపచేయాలన్నారు.


