నాగిరెడ్డిపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో వాన దంచికొట్టింది. జుక్కల్‌లో 89.5 మిల్లీ మీటర్లు, మహ్మద్‌నగర్‌లో 80.8, పిట్లంలో 79.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నాగిరెడ్డిపేట మండలంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షం పడింది. సోమవారంరాత్రి సుమారు రెండుగంటలపాగు జోరువాన కురిసింది. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి సైతం భారీ వర్షం కురియడంతో పొలాల్లో నీరు నిలిచింది. పోచారం ప్రధానకాలువ జలకళ సంతరించుకుంది.
‘పోచారం’లోకి కొత్తనీరు
పోచారం ప్రాజెక్టులోకి మంగళవారం నుంచి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో లింగంపేటవాగు ద్వారా 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీ (0.110 టీఎంసీ)లోనే ఉందన్నారు.
నిజాంసాగర్‌లోకి 1,207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం 1,207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,394.62 అడుగుల (6.582 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
వాగుల్లో జలకళ..
నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రధానంగా శేర్‌ఖాన్‌పల్లి శివారులోని మత్తడిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండడతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


