కామారెడ్డి అర్బన్: పట్టణంలోని గుమస్తా కాలనీకి చెందిన కల్యాణ్, హరికలు పుట్టుకతో అంధులు. వారిని అంధుల పాఠశాలలో చేర్పించి మంచి భవిష్యత్తు అందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతినిధులు ప్రయత్నించారు. అందులో భాగంగా శనివారం నిజామాబాద్‌కు చెందిన స్నేహ సొసైటీ అంధుల పాఠశాల వీరిని దత్తత తీసుకుంది. పిల్లలకు చదువు చెప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతినిధులు వారికి ఆర్థిక చేయూత అందించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు లింబాద్రి, ప్రదీప్‌కుమార్, పీవీ నర్సింహం, దామోదర్‌రెడ్డి, మల్లే శ్, గంప మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం కామారెడ్డికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవీ లత, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిదా, జిల్లా న్యాయాధికారులు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌లు ఘన స్వాగతం పలికారు. వారికి పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదివారం హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వివిధ న్యాయస్థానాల పనితీరు, న్యాయ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాల న్యామూర్తులు, రెవెన్యూ, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా న్యాయ సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ ఎక్స్‌టెన్షన్ సెంటర్) ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) సేవలు అందిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్ పి. ముక్తిదా తెలిపారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మొత్తం 181 ఎస్‌ఐఆర్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, కక్షిదారులు, సాధారణ ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
దోమకొండ: గతంలో పాత సమితి, తాలుకా కేంద్రంగా కొనసాగిన దోమకొండలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఐరేని నర్సయ్య హైకోర్టు న్యాయమూర్తులకు శనివారం గడికోటలో వినతిపత్రం ఇచ్చారు. తాలుకా పరిధిలోని మూడు మండలాలకు సంబంధించిన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. హైకోర్టు జడ్జిలు మాధవిదేవి, అలిశెట్టి లక్ష్మినారాయణ, గాడి ప్రవీణ్‌కుమార్, నిజామాబాద్ జిల్లా జడ్జిలు భరతలక్ష్మి, హరీష, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, వార్డు సభ్యులు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్దరాములు, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ తదితరులు ఉన్నారు.


