కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో విధులు నిర్వర్తించే ఆర్‌ఎంవో (వైద్యుడు) పేరిట నకిలీ స్టాంప్, సంతకం ఫోర్జరీతో సంక్షేమ పథకాలు, ఇతర సర్టిఫికెట్లు పొందేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వైద్యుడు ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పట్టణ సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. ఈ నెల 22న మధ్యాహ్నం ఆస్పత్రిలోని కొన్ని ధ్రువపత్రాలను ఆర్‌ఎంవో డాక్టర్ సంతోష్ పరిశీలించగా, వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని గుర్తించారు. తన అనుమతి లేకుండా అధికారిక సీల్‌ను దుర్వినియోగం చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రయోజనాల కోసం నకిలీ పత్రాలు, సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు, ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంతకం ఫోర్జరీ వ్యవహారంలో ఆస్పత్రి సిబ్బంది సహకారం ఏమై నా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ స్టాంప్‌తో సంక్షేమ పథకాలు, ఇతర సర్టిఫికెట్‌ల కోసం వినియోగం
డాక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు
విచారణ చేస్తున్న పట్టణ పోలీసులు
అదుపులో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు!


