రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కోటగిరి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురుగా వచ్చిన మూడు ఇసుక ట్రాక్టర్లను ఆపి పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని కోటగిరి పోలీస్‌స్టేషన్‌న్‌కు తరలించారు. మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి మూడు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా.. గ్రామస్తులు మాత్రం అక్రమ ఇసుక రవాణా చాలా కాలంగా కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.


