తరుగని దోపిడీ | - | Sakshi
Sakshi News home page

తరుగని దోపిడీ

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

తరుగని దోపిడీ

మూడున్నర క్వింటాళ్ల తరుగు

నెల రోజులైనా కాంటా కాలే..

లారీకి ఐదునుంచి

ఎనిమిది క్వింటాళ్ల వరకు కోత

నష్టపోతున్నామంటున్న రైతులు

లింగంపేట: తరుగు పేరిట రైస్‌ మిల్లర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మండలంలో యాసంగికి సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీనికితోడు లారీలు రాకపోవడంతో తూకం వేసిన వడ్లు సైతం కొనుగోలు కేంద్రాలలోనే మూలుగుతున్నాయి. తూకం వేసిన తర్వాత వారం పదిరోజులకు మిల్లులకు తరలిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ధాన్యం మరింత ఎండి బరువు తగ్గాయంటూ మిల్లర్లు లారీకి ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా తూకం వేయించడంతోపాటు వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని కోరుతున్నారు.

లారీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో మరింత నష్టం

లారీల డ్రైవర్లు నిర్లక్ష్యంతో వాహనాలను నడుపుతుండడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. మిల్లులకు తరలించే క్రమంలో బస్తాలు దారి మధ్యలో పడిపోతున్నాయి. ఐదు రోజుల క్రితం లారీలోంచి ఎర్రాపహడ్‌, తాడ్వాయి మధ్యలో 20 బస్తాల వరకు రోడ్డుపై పడిపోయాయి. లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.

పంట కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన నెల రోజులకు కాంటా పెట్టారు. 376 బస్తాలు అయ్యాయి. తూకం వేసిన ఐదు రోజుల తర్వాత మిల్లుకు తరలించారు. అక్కడ మూడున్నర క్వింటాళ్లు తరుగు తీశారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన సమయంలో వచ్చిన వేయిట్‌కే డబ్బులు చెల్లించాలి.

– వెంకటేశ్వర్‌గౌడ్‌, రైతు, కొర్పోల్‌

రెండెకరాలలో వరి పండించాను. పంట నూర్పిళ్లు చేసి కొనుగోలు కేంద్రానికి తరలించి నెల రోజులు అవుతోంది. ఇప్పటికీ కాంటా పెట్టలేదు. ఐకేపీ అధికారులు నేడు, రేపు అంటూ తిప్పుతున్నారు. రోజూ వడ్ల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి త్వరగా తూకం వేయించాలి.

– కాంతమణి, రైతు, కొర్పోల్‌

Advertisement
 
Advertisement
Advertisement