భిక్కనూరు: ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందకు లారీల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భిక్కనూరు తహసీల్దార్ సునీత అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని గురువారం వారు సందర్శించారు. మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తహసీల్దార్‌కు వివరించారు. దీంతో ఆమె రైతులకు ఇబ్బందులు కలుగుకుండా చూడటంతోపాటు వేగంగా కాంటాలను చేయించి మిల్లులకు తరలిస్తామన్నారు. విండో డైరెక్టర్ కిష్టారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సింగం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
దోమకొండ: మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం గ్రామ సంఘాల ఆడిటింగ్ నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ శివ ఆధ్వర్యంలో 29 గ్రామ సంఘాలు, మండల సమాఖ్య మొత్తము 30 సంఘాల ఆడిటింగ్ నిర్వహించినట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. గతేడాదికి సంబంధించిన మండల సమాఖ్య ఆడిటింగ్ చేశారు. జిల్లా ఫైనాన్స్ డీపీఎం రాజయ్య, డీఎంజీ రామచంద్ర గౌడ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భూలక్ష్మి, కార్యదర్శి స్వప్న, కోశాధికారి శారద, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం మండల సమాఖ్యతోపాటు 32 గ్రామ సంఘాలకు సంబంధించి అధికారులు ఆడిట్ నిర్వహించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఏపీఎం రాంనారాయణ గౌడ్, అకౌంటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: పట్టణంలోని ఎల్లయ్య చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలంటూ మున్సిపాలిటీ ప్రతిపక్ష కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు గురువారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా నిబంధనల ప్రకారం టెండర్‌వేసి మట్టి తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అనేక అక్రమ లే–అవుట్లు ఉన్నాయని ఆరోపించారు. అనుమతి లేని కట్టడాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లు గజ్జల మహేష్, గడ్డమీది అంజాగౌడ్, మక్బూల్, అంజుమ్ ఖలీల్, సామల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: భిక్కనూరు–బస్వాపూర్ గ్రామాల మధ్య సరిహద్దులను సర్వేఅధికారులు గురువారం గుర్తించారు. ఈసందర్భంగా సర్వేయర్ సవిత మాట్లాడుతూ.. గ్రామాల మధ్య హద్దుల వివాదం రాకుండా ప్రభుత నిర్ణయం మేరకు హద్దులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని గ్రామాల సరిహద్దులను గుర్తించి హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు. సర్పంచ్‌లు బల్యాల రేఖసుధర్శన్, తుడుం పద్మ స్వామిలు ఉన్నారు.


