వివాహానికి హాజరవడమూ నేరమే..
● భారాన్ని దించుకునే క్రమంలో బాల్యానికి
మూడు ‘ముళ్లు’!
● జిల్లాలో పెరుగుతున్న బాల్యవివాహాలు
● అవగాహన కల్పిస్తున్నా ఆగని పెళ్లిళ్లు
● అధికారులు అడ్డుకుంటున్నా మారని తల్లిదండ్రుల తీరు
చక్కగా చదువుకొని ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయసులో.. ఆ బాలికలు పెళ్లి కూతుళ్లుగా మారుతున్నారు. మూడుముళ్ల బంధంతో వారి బాల్యం బందీ అవుతోంది. యుక్త వయసు రాకముందే కొందరు తల్లులూ అవుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా, కేసులు పెడుతున్నా బాల్య వివాహాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
– నాగిరెడ్డిపేట
చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అనేక అనర్థాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వారి మానసిక, శారీరక స్థితిపైనా ప్రభావం పడుతుంది. చిన్నవయసులోనే గర్భం దాల్చడంతో తల్లీబిడ్డలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనత, నెలలు నిండకముందే ప్రసవం, తక్కువ బరువుతో పిల్లలు జన్మించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాన్పు కష్టం కావడం వల్ల ప్రసూతి మరణాలు, శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రులు మాత్రం మారడం లేదు. ఆడపిల్లలను భారంగా భావిస్తున్నవారు.. యుక్త వయసు రాకముందే పెళ్లి ద్వారా దానిని దించుకోవాలని చూస్తున్నారు.
ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. పేదరికం, అవిద్య, సాంఘిక ఆచారాల కారణంగా ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలను భారంగా భావించేవారు త్వరగా పెళ్లి చేసి పంపించాలని చూస్తూనే ఉన్నారు. ఇటీవల జిల్లాలోని చాలాచోట్ల బాల్యవివాహ యత్నాలను అధికారులు అడ్డుకొన్నారు. అయినా కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలతో అనర్థాలపై అవగాహన లేక కొందరు బాల్య వివాహాలు జరిపిస్తుండగా.. కొందరు అన్నీ తెలిసి కూడా టీనేజ్ ప్రేమలు, పిల్లల భద్రతపై ఆందోళనతో చిన్న వయసులోనే పెళ్లి కానిచ్చేస్తున్నారు.
46 వివాహాల నిలిపివేత..
బాల్య వివాహం జరుగుతోందని సమాచారం అందగానే బాలల సంరక్షణ అధికారులు పోలీసుల సహకారంతో ఆ ఊళ్లో వాలుతున్నారు. వధూవరుల తల్లిదండ్రులను కలిసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్న వయసులో వివాహాలతో ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ యుక్త వయసు వచ్చేంతవరకు వారికి వివాహం జరిపించవద్దని సూచిస్తున్నారు. జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారులు 46 బాల్యవివాహాలను నిలిపివేయడం గమనార్హం. ఇందులో 45 మంది బాలికలు, ఒక బాలుడి వివాహాన్ని అడ్డుకున్నారు.
బాల్యవివాహాలను నిర్మూలించేందుకు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అయినా కొన్ని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలలో బాల్య వివాహాలు ఆగడం లేదు. చాలాసార్లు పెళ్లిచేసే ఒకరోజు ముందుగాని, పెళ్లిరోజుగాని సమాచారం అందుతోంది. దీంతో మేం వెళ్లి ఆ పెళ్లిని ఆపుతున్నాం. దీనివల్ల ఇరు కుటుంబాలకు ఆర్థికపరమైన నష్టం కలుగుతోంది. వారు అవమానంగానూ భావిస్తున్నారు. అందుకే ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగవారికి 21 ఏళ్లు వచ్చాకే వివాహం జరిపించాలి.
– స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి
బాల్యవివాహం చేసిన వారెవరైనా చట్టం ప్రకారం నేరస్తులే అవుతారు. తల్లిదండ్రులు, సంరక్షుకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బాల్య వివాహానికి అనుమతించిన కులపెద్దలు, వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరిపైనా కేసులు నమోదయ్యే అవకాశాలుంటాయి. పెళ్లికి హాజరైనవారు కూడా నేరస్తులవుతారు. దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా పడవచ్చు.


