ఆక్రమణలివిగో..
పట్టణంలోని ఓపెన్ స్థలాలకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన బల్దియా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో మున్సిపల్ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా.. రక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – కామారెడ్డి టౌన్
● మున్సిపల్ స్థలాలకు బోర్డులు,
ఫెన్సింగ్ కరువు
● కబ్జా అవుతున్న ఓపెన్ స్థలాలు
● పట్టించుకోని పాలకవర్గం
మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాలు మినహా గతంలో 160కి పైగా ఓపెన్ స్థలాలు ఉండేవి. వీటిలో ఆలయాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థలకు కేటాయించగా అధికారికంగా పట్టణంలో 90కి పైగా ఓపెన్ స్థలాలు మిగిలాయి. విలీన గ్రామాల్లో ఓపెన్ స్థలాలు మరో వంద వరకు ఉన్నాయి. ప్రస్తుతం వాటికి రక్షణ లేకుండాపోయింది. ప్రైవేట్ లేఅవుట్లలో నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి కేటాయించాల్సిన ఓపెన్ స్థలాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. లేఅవుట్ అనుమతి పొందే సమయంలో మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పటికీ.. ఆ తర్వాత ఆయా స్థలాల్లో బోర్డులు పాతకపోవడం, రక్షణ గోడలు నిర్మించకపోవడం ఆక్రమణదారులకు వరంగా మారుతోంది. మున్సిపాలిటీకి చెందిన స్థలం అని తెలిపేలా కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాలక్రమేణా పక్కనే ఉన్న ప్లాట్ల యజమానులు, కబ్జాదారులు ఆయా ఓపెన్ స్థలాలను ఆక్రమించుకోవడం, నకిలీ పత్రాలతో విక్రయించడం పరిపాటిగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి, పట్టణంలోని మున్సిపల్ స్థలాలను సర్వే చేయించి, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బల్దియా స్థలాల రక్షణకు తగిన చర్యలు చేపడతాం. ఈ విషయంపై రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తాం. ప్రత్యేక నిధులు కేటాయించి ఓపెన్ స్థలాలలో హెచ్చరిక బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. ఎవరైనా మున్సిపల్ స్థలాలను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
– పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
రాంమందిర్ ఆలయం ముందు కంచె లేని మున్సిపల్ స్థలం
జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ రోడ్ సర్వే నంబర్ 6 ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో గతంలో భూమిలో ఉన్న కబ్జాదారులకు నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ స్థలం మళ్లీ కబ్జాలకు గురైంది.
అశోనగర్ కాలనీలో ఓపెన్ స్థలాన్ని ఓ ప్రజాప్రతినిధి నకిలీ ధ్రువపత్రాలతో ఇతరులకు విక్రయించాడు. అతను భవన నిర్మాణ పనులు చేపట్టగా అధికారులు అడ్డుకున్నారు. అయితే అందులోనే ఒక ప్రభుత్వ ఉద్యోగి నిర్మించిన ఇల్లు మాత్రం అలాగే ఉంది.
పట్టణంలోని ఓ హోటల్ వెనక ఉన్న ఓపెన్ స్థలాన్ని పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ స్వాధీనం చేసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చినా అధికారుల్లో చలనం లేదు. దాని పక్కనే మరో సర్కారు స్థలానికి బోర్డు ఉన్నప్పటికీ, ఆ స్థలంలో ప్రహరీ నిర్మించి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు.
గ్రీన్ సిటీలో చాలా ఓపెన్ స్థలాలు మాయం అయ్యాయి. వెంచర్ యజమానులే వాటిని విక్రయించారన్న ఆరోపణలున్నాయి. దేవివిహార్, దేవునిపల్లిలలోనూ పలు ఓపెన్ స్థలాలు మాయమయ్యాయి.
గ్రీన్ సిటీలో 80 ఫీట్ల రోడ్డు కబ్జాలకు గురవుతోంది. ఇళ్ల నిర్మాణాలతో పాటు, రోడ్డుపై హద్దులు వేసుకుని స్థలాలను కొందరు స్వాధీనం చేసుకుంటున్నారు.
రాంమందిర్ ఆలయం ఎదురుగా ఉన్న 250 గజాల మున్సిపల్ స్థలాన్ని కొందరు రెండేళ్ల క్రితం కబ్జా చేయడానికి యత్నించారు. అప్పట్లో ‘సాక్షి’లో కథనం రావడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అయినా ఇప్పటికీ ఆ స్థలం మళ్లీ కబ్జా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కన, గంజ్ స్కూల్ ముందున్న మున్సిపల్ స్థలాలకు రక్షణలేదు.
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఇప్పటివరకు ఏ ఒక్క ఓపెన్ స్థలానికి కూడా రక్షణగా హెచ్చరిక బోర్డులు, ఫెన్సింగ్, ప్రహరీలు లేవు.


