ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించాలి | - | Sakshi
Sakshi News home page

ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించాలి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

స్వదేశీ వస్తువులనే వినియోగించాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

కామారెడ్డి శ్రీరాంనగర్‌ బస్తీ

హిందూ సమ్మేళనంలో వక్తలు

కామారెడ్డి అర్బన్‌: హిందువులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించాలని జాతీయ సాహిత్య పరిషత్‌ తెలంగాణ ప్రాంత కార్యదర్శి మావుడూరి సూర్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విలువలు, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్‌ బస్తీ హిందూ సమ్మేళనాన్ని ఆదివారం రాత్రి వివేకానంద కాలనీలోని మున్సిపల్‌ పార్క్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్త సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ హిందువులందరు దేశభక్తితో ఏకమై ఒక శక్తిగా మారకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక మార్పు కోసం కృషి చేయాలని సూచించారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, పౌర బాధ్యతలు నిర్వర్తించాలని, స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, సామాజిక సమరసత పాటించాలని పిలుపునిచ్చారు.

కేవలం భక్తి, ధర్మం ఉంటే సరిపోదని, అవసరమైనప్పుడు శక్తిగా మారాలని ముఖ్యఅతిథి ఇనమడుగు శ్రీసత్యానంద ఆశ్రమం స్వామీజీ విశోక తీర్థ పేర్కొన్నారు. సమాజంలో వృత్తుల వారీగా కులాలు ఏర్పాడ్డాయని, ఏ కులం వారైనా హిందువులందరూ ఒక్కటే అనే భావం రావాలన్నారు. సమ్మేళనంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి, కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్‌, నాగమణి, గ్యార అఖిల, కోఅప్షన్‌ సభ్యురాలు గోనె సునీత, హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆంజనేయులు, అధ్యక్షుడు రామచంద్రం, ప్రతినిధులు ఉప్పల హరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement