చెరువులకు మరమ్మతులు చేయాలి | - | Sakshi
Sakshi News home page

చెరువులకు మరమ్మతులు చేయాలి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ డిమాండ్‌

కన్నాపూర్‌, పొల్కంపేట శివారులోని చెరువు కట్ట వద్ద ఆందోళన

లింగంపేట: వర్షాకాలంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన కన్నాపూర్‌, పొల్కంపేట శివారులోని చెరువు కట్ట వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్నాపూర్‌, పొల్కంపేట, కొత్తపల్లి గ్రామాలకు సాగు నీరు అందించే చెరువు కట్ట గత వర్షాకాలంలో వరద నీటి తాకిడికి కొట్టుకుపోయిందన్నారు. దాంతో చెరువు కట్ట కింది భాగంలో పంటలు సైతం కొట్టుకుపోయాయని, వందల ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయన్నారు. నేటికీ అధికారులు ఇసుక మేటలు తొలగించలేదని, చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టలేదని పేర్కొన్నారు. ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి వచ్చి సందర్శించిన లింగంపల్లి పాముల వాగు బ్రిడ్జి పనులు సైతం నేటికీ ప్రారంభించకపోవడం దారుణమన్నారు. ఆయన నీటిపారుదల శాఖ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడగా.. ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించామని, నిధులు రాగానే పనులు చేపడతామని సమాధానమిచ్చారు. వారం రోజుల్లో మరమ్మతులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. మూడు గ్రామాల రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. పొల్కంపేట, లింగంపల్లి మల్లారం చెరువులకు సైతం మరమ్మతులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పొల్కంపేట సర్పంచ్‌ రమేశ్‌, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, నాయకులు మహిపాల్‌రెడ్డి, విఠల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement