ఇంగ్లిషే రాదు..యాప్ ఏంటి..?
● బేసిక్ ఫోన్లు వాడుతున్న మెజారిటీ అన్నదాతలు
● స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం
రాదంటున్న రైతులు
ఎల్లారెడ్డి: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు, యాప్‌లను ప్రవేశపెట్టింది. కానీ సాధారణ రైతుకు ఈ పథకాలు, యాప్‌లు అందనంత దూరంలో ఉంటున్నాయి. వీరికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడమే ఇందుకు కారణం. రైతులలో దాదాపు 60 శాతం మంది స్మార్ట్ ఫోన్లు కాకుండా సాధారణ ఫోన్లనే వాడుతున్నారు. వారికి స్మార్ట్ ఫోను ఎలా వాడాలో తెలియకపోవడమే ప్రధాన కారణం. ఇంట్లో పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నా భూములు వీళ్ల పేర్ల మీదే ఉండటం వల్ల పిల్లల స్మార్ట్ ఫోన్లు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ రబీ సీజన్‌లో ఎరువులను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవడానికి సాధారణ ఫోన్లున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కడ ఎరువులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయన్న సమాచారం పూర్తిగా ఫోన్ యాప్‌లలోనే ఉంటుండటంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఎరువులే కాకుండా పంట సబ్సిడీలు, రైతు భరోసా, పంట భీమా, ఈ–క్రాప్ నమోదు, ధాన్యం కొనుగోళ్ల నమోదు వంటి సేవలు ఇప్పుడు మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలు తమ పథకాలను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుండగా సాంకేతిక పరిజ్ఙానం లేని సాధారణ రైతులు వాటి లబ్ధి పొందడం లేదు.
ప్రభుత్వం రైతుల కోసం తెచ్చిన యాప్‌లు
పీఎం కిసాన్ యాప్: రైతు సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాలలో జమయ్యే డబ్బుల వివరాలు ఈ యాప్‌లోనే ఉంటాయి. రైతుల రిజిస్ట్రేషన్లు, వాటి స్థితి, ఈ–కైవెసీ, ఆధార్ లింకింగ్ వంటి ముఖ్యమైన పనులు ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఆదార్ కార్డులలో ఏవైనా తప్పులుంటే ఎడిట్ ఆధార్ డిటైల్స్ ద్వారా సరిచేసుకోవచ్చు. ఎటువంటి సేవా కేంద్రాలకు వెళ్లకుండా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. యాప్‌లోని హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి ఏవైనా ఫిర్యాదులు ఉంటే నమోదు చేసుకోవచ్చు.
కిసాన్ సువిధ యాప్: వాతావరణం, మార్కెట్ ధరలు, ఎరువుల సమాచారం, పంట సలహాలు ఈ యాప్ ద్వారా లభిస్తాయి.
మేఘదూత్ : ఈ యాప్ ద్వారా తమ ప్రాంత వాతావరణ హెచ్చరికలు, వర్షపాతం సూచనలు లభిస్తాయి.
ప్లాంటిక్స్ : రైతులకు ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన యాప్ ఇది. రైతులు తమ పంటలు, మొక్కలు, తోటలకు సోకిన తెగుళ్లు, వైరస్‌లు, వ్యాధుల గురించి వాటి నివారణ చర్యలు గురించి తెలుసుకోవచ్చు. రైతులు తెగులు సోకిన పంటలను లేదా మొక్కలను ఫొటో తీసి ఈ యూప్‌లో పెడితే వాటికి ఏ తెగులు వచ్చిందో.. నివారణ చర్యలేమిటో వివరాలు వస్తాయి.
ఈ–నామ్ : వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ సమాచారం ఈ యాప్ ద్వారా లభిస్తుంది.
అగ్రి మార్కెట్ : ఈ యాప్ ద్వారా రైతులు స మీప మార్కెట్లలో పంటల ధరలు తెలుసుకోవచ్చు
సాయిల్ హెల్త్ కార్డు: ఈ యాప్ ద్వారా తమ భూముల పరీక్షలు, పోషకాలు, ఎరువుల సూచనలు లభిస్తాయి.
క్రాప్ ఇన్సూరెన్స్: పంటల భీమా నమోదు, క్లెయిమ్ల స్థితి వివరాలు తెలుసుకోవచ్చు
స్మార్ట్ ఫోన్లు ఉపయోగించలేని రైతులకు..
ప్రత్యామ్నాయాలు
రైతు సేవ కేంద్రాలు: గ్రామాల్లోని వ్యవసాయ విస్తర ణ అధికారులను (ఏఈవో) లేదా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలలో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
మీ–సేవ లేదా సీఎస్సీ కేంద్రాలు: రైతులు తమ సమీపంలోని మీ–సేవ లేదా కామన్ సర్వీసింగ్ సెంటర్లకు (సీఎస్సీ) వెళ్లి ఆధార్ నెంబర్, భూమి పత్రాల ఆధారంగా సంక్షేమ పథకాల వివరాలు, పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
పోస్టాఫీసులు: గ్రామాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ద్వారా అనేక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
వ్యవసాయ శాఖ అధికారుల సహాయం: రైతులు నేరుగా మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సమస్యలను వివరిస్తే వారు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తారు.
ఇంగ్లిష్ రాని మాకు స్మార్ట్ ఫోన్లు ఎలా ఉపయోగించాలో, యాప్‌లు ఎలా చూడాలో ఎలా తెలుస్తాయి. పిల్లల ఫోన్లో చూద్దామన్నా వారు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారా. ఎరువులు, సబ్సిడీల వివరాలన్నీ ఫోన్లలోనే వస్తున్నాయి
–మండ్రు లక్ష్మయ్య, రైతు, ఎల్లారెడ్డి


