నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెదలోని విత్తన క్షేత్రం సమీపంలో గల ఫారెస్ట్ నర్సరీలో బుధవారం మంటలు చెలరేగాయి. నర్సరీలోని టేకు చెట్ల మధ్య మంటలను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులతోపాటు విత్తనక్షేత్ర సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, విత్తనక్షేత్ర సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.
నిజాంసాగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌వో రవీందర్ గౌడ్ తనిఖీ చేశారు. ఓపీ వివరాలు, అందిస్తున్న సేవలు, మందుల వివరాలు తెలుసుకున్నారు. సబ్ సెంటర్లలో తాగు నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకట్లను రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ తదితరులున్నారు.
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న పి.యుక్తేశ్వరి జాతీయస్థాయి అండర్–14 రగ్బీ పోటీలకు ఎంపికై ందని ప్రిన్సిపాల్ గీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో యుక్తేశ్వరి, స్రవంతి పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ పోటీలలో సత్తా చాటడంతో యుక్తేశ్వరిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని తెలిపారు. ఈనెల 10, 11 తేదీలలో ఢిల్లీలో నిర్వహించే టోర్నీలో యుక్తేశ్వరి పాల్గొంటుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థినులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.
కామారెడ్డి టౌన్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 27 వరకు జరిగే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను గురువారంనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని డీఈవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 కు ‘హాయ్’ అని సందేశం పంపి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో శుక్రవారం మెగా ఆయుష్ ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యుడు దేవయ్య తెలిపారు. బుధవారం ఆయన 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షితకు ఆహ్వాన పత్రిక అందించారు. ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్య సేవలు అందిస్తామన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగా శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో పాటు వైద్యాధికారులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఆయూష్ వైద్యులు చంద్రశేఖర్, జునేద్ బేగం, విజయ, ఫార్మసిస్ట్ కిషోర్, యోగా మాస్టర్ బాల్‌లింగం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా పోలీస్ శాఖలో పరిపాలనా కారణాలరీత్యా ఆరుగురు ఎస్సైలను అటాచ్‌మెంట్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. బి.ఆంజనేయులును గాంధారి నుంచి పిట్లంకు, ఎం.మహేందర్‌ను బీర్కూర్ నుంచి గాంధారికి బదిలీ చేశారు. కె.నవీన్ చంద్రను జుక్కల్ నుంచి బాన్సువాడకు, బి.మురళిని బాన్సువాడనుంచి జుక్కల్‌కు, వీకే రాములునుబాన్సువాడ నుంచి బీర్కూర్‌కు, టి.వెంకట్రావును పిట్లం నుంచి బాన్సువాడకు అటాచ్‌మెంట్ చేశారు.


