కొనుగోళ్లకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు వేళాయె!

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

కొనుగోళ్లకు వేళాయె!

అవసరమైన పరికరాలు తెప్పిస్తున్నాం..

ఇబ్బందులు లేకుండా చూస్తాం

జిల్లాలో 2.57 లక్షల ఎకరాల్లో

వరి సాగు

411 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదన

నేటి నుంచి ప్రారంభం కానున్న కేంద్రాలు

కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి: జిల్లాలో యాసంగి వరి సాగు చివరి దశకు చేరుకుంది. దీంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 2.57 లక్షల ఎకరాల్లో వరిసాగయ్యింది. ఇంటి అవసరాలకుపోను కొనుగోలు కేంద్రాలకు దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో..

గతేడాదిలాగే ఈ యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు 411 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 179, సహకార సంఘాల ఆధ్వర్యంలో 232 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కేంద్రాల్లో 362 కేంద్రాలను దొడ్డురకం ధాన్యానికి, 49 కేంద్రాలను సన్న రకం ధాన్యం సేకరణకు కేటాయించారు.

6 లక్షల టన్నులకుపైగా దిగుబడి అంచనా..

జిల్లాలో ప్రధాన పంట వరి. ప్రస్తుత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,57,785 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీంట్లో 1,50,470 ఎకరాల్లో దొడ్డు రకాలు, 1,00,315 ఎకరాల్లో సన్నాలను పండిస్తున్నారు. మొత్తం 6,06,899 మెట్రిక్‌ టన్నుల దిగుబడులు రావచ్చని అధికారులు అంచనా వేశారు. రైతులు తమ ఇంటి అవసరాలకుపోను దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరి కోత దశకు వచ్చింది. నిజాంసాగర్‌, పోచారం తదితర ప్రాజెక్టులు, సాగునీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో మరో 15 రోజుల్లో కోతలు షురూ అవుతాయి. బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, నిజాంసాగర్‌ తదితర మండలాల్లో ఇప్పటికే వరి కోతకు వచ్చింది. ఆయా ప్రాంతాల్లోని రైతులు కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ రెండో వారం చివర నుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులు, మాయిశ్చర్‌ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు, ఎలక్ట్రానిక్‌ తూకం మిషన్లు, టార్పాలిన్లు తగినన్ని ఉన్నాయని, అవసరమైన పరికరాలను తెప్పిస్తున్నామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి రమ్య తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 783 ఎలక్ట్రానిక్‌ తూకం మిషన్లు ఉన్నాయని, మరో 60 తెప్పిస్తున్నామన్నారు. 594 మాయిశ్చర్‌ మీటర్లు ఉండగా అదనంగా 105 తెప్పిస్తున్నామని, 9,448 టార్పాలిన్లు ఉండగా అదనంగా 2,200, ప్యాడీ క్లీనర్లు 311 ఉండగా మరో 84 ఆటోమెటిక్‌ ప్యాడీక్లీనర్లు, 422 కాలిపర్స్‌ ఉండగా మరో 10, ప్యాడీ డ్రయ్యర్లు 4 ఉండగా మరో నాలుగు తెప్పిస్తున్నామని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 68 లక్షల గన్నీ బ్యాగులు ఉన్నాయని ఇవి కాకుండా అవసరమైనన్ని ఇంకా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

జిల్లాలో 411 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నాం. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

– శ్రీకాంత్‌, డీఎం, సివిల్‌ సప్లయ్‌

కార్పొరేషన్‌, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement