శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలి
● మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత కామారెడ్డి లక్ష్యంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఏటా రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, భవిష్యత్తులో ప్రమాదాలను మరింత తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు అతికించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, వివిధ శాఖల అధికారలు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ సభలకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి క్రైం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2నుంచి నిర్వహించే గ్రామ సభలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో మాట్లాడారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభల నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామ సభలను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఆయన ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర సజావుగా, శాంతియుత వాతావరణంలో జరగడానికి తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శోబాయాత్ర నిర్వహణ ప్రతినిధులతో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్బీ సీఐ మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


