● పడిపోతున్న భూగర్భ జలమట్టం
● రెండు నెలల్లో 3.58 మీటర్లు
పడిపోయిన నీరు
● ఆందోళనలో రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యాసంగి పంటల సాగుకు నీటి వాడకం పెరగడంతో పాటు ఎండలు మండుతుండడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు నెలల్లో 3.58 మీటర్ల మేర పడిపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో బోర్లు ఎత్తిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో 1.92 మీటర్లు పడిపోగా, మార్చి నెలాఖరులో మరో 1.66 మీటర్ల లోతుకు వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోయి బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.
ఎత్తిపోతున్న బోర్లు...
భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లు ఎత్తి పోతున్నాయి. మెట్ట ప్రాంతమైన కామారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి, పాల్వంచ, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, తాడ్వాయి. రాజంపేట, గాంధారి, లింగంపేట తదితర మండలాల్లో భూరగ్భ జలాలు పడిపోయి బోర్లలో నీటి ఊటలు తగ్గిపోయా యి. కొన్ని గ్రామాల్లో అయితే బోర్లు ఎత్తిపోయి సాగు నీటి కష్టాలు పెరిగాయి. దీంతో పంటలకు నీరందించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. మరికొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు పంటను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏటా యాసంగిలో సాగునీటి సమస్య ఎదురవుతూనే ఉంది. భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగి ఎత్తిపోయిన బోర్లు చాలా వరకు వినియోగంలోకి వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో నీటి వాడకం పెరగడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.


