● ముగిసిన ఆర్థిక సంవత్సరం
● 59 శాతమే కామారెడ్డి బల్దియా
ఆస్తి పన్ను వసూలు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల పర్వం నత్తనడకన సాగింది. 2025 –26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 60 శాతం కూడా చేరుకోలేదు. మున్సిపల్ యంత్రాంగం ఎన్ని నోటీసులు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడం గమనార్హం.
రూ. 9.10 కోట్లే వసూలు..
కామారెడ్డి బల్దియా పరిధిలో ఈ ఏడాది మొత్తం రూ. 15.44 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యం. అయితే మంగళవారం సాయంత్రం వరకు కేవలం రూ. 9.10 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే కేవలం 59 శాతం వసూళ్లతోనే మున్సిపాలిటీ సరిపెట్టుకుంది. చివరి రోజున మంగళవారం రూ. 50 లక్షలకు పైగా వసూలయ్యాయి. ఇంకా దాదాపు రూ. 6.34 కోట్ల మేర వసూలు కావాల్సి ఉంది.
సెలవులో ఆర్‌ఐ..
పన్ను వసూళ్లపై పర్యవేక్షణ చేయాల్సిన రెవెన్యూ అధికారి రవిగోపాల్ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. భారీ బకాయిలు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, నివాస గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నా.. యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై ఉన్నతాధికారులు సైతం బల్దియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


