ప్రభుత్వ శాఖలు బకాయి పడిన ఆస్తి పన్ను వివరాలు..
సామాన్యుల నుంచి పైసా వదలకుండా పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు.. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నిస్సహాయులవుతున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకపోవడంతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ భవనాల బకాయిలు మున్సిపాలిటీకి ‘గుదిబండ’లా మారాయి. ప్రస్తుతం మొత్తం బకాయిలు రూ. 8.49 కోట్లకు చేరాయి.
అసలు కంటే పెనాల్టీలే అధికం
పట్టణంలో 84 రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, 14 కేంద్ర ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇందులో చాలా కార్యాలయాలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా కార్యాలయాలు ఏళ్ల తరబడిగా పన్నులు చెల్లించడం లేదు. దీంతో అసలు కన్నా పెనాల్టీల భారం ఎక్కువయ్యింది. మొత్తం బకాయిల్లో ఏరియర్స్‌తో కలిపి అసలు పన్ను రూ. 2.93 కోట్లు ఉండగా.. దీనికి వడ్డీ ఏకంగా రూ. 5.17 కోట్లు కావడం గమనార్హం. గతంలో ప్రభుత్వం వడ్డీలో 90 శాతం రాయితీ కల్పించినా ప్రభుత్వ శాఖల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇప్పుడు ఆ పన్నులు మోయలేని భారంగా మారాయి.
అగ్రస్థానంలో ప్రభుత్వ ఆస్పత్రి..
బకాయిల జాబితాను పరిశీలిస్తే జిల్లా కేంద్ర ఆస్పత్రి అత్యధికంగా రూ. 3.58 కోట్లకుపైగా బల్దియాకు బకాయి పడింది. రూ. 42.13 లక్షలతో రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. మెడికల్ క్వార్టర్స్‌కు సంబంధించి రూ. 29.56 లక్షలు బకాయి ఉన్నారు. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకే నిధులు సరిపోతున్నాయని, ఆస్తి పన్నుల చెల్లింపునకు నిధుల కొరత ఉందని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.
ఆర్థిక సంక్షోభంలో బల్దియా..
కామారెడ్డి మున్సిపాలిటీకి ఆస్తి పన్నుల బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో బల్దియా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడాలేదు. బకాయిలు వసూలు చేస్తే బల్దియా అభివృద్ధి పథంలో పయనించడానికి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయం
ఆస్తి పన్ను బకాయిలపై ఏటా ప్రభుత్వ శాఖలకు నోటీసులు ఇస్తున్నాం. బకాయిల వివరాలను ఉన్నతాధికారులకు, సీడీఎంఏకు నివేదించాం. అసలు కంటే వడ్డీలు ఎక్కువవుతున్నాయి. కనీసం 50 శాతం బకాయిలు వసూలైనా మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంది.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్
కమిషనర్, కామారెడ్డి
ఏరియర్స్ : రూ. 2,93,29,643
ఏరియర్స్‌పై పెనాల్టీ : రూ. 5,17,00,504
ప్రస్తుత పన్ను : రూ. 35,21,296
ప్రస్తుత పన్నుపై పెనాల్టీ : రూ. 4,22,283
మొత్తం బకాయిలు : రూ. 8,49,73,726
చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్నులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏళ్ల తరబడిగా బకాయి పడడంతో అసలుకన్నా వడ్డీలే ఎక్కువయ్యాయి. కామారెడ్డి బల్దియాలో రూ. 8.49 కోట్లపైనే పన్నులు వసూలు కావాల్సి ఉంది. – కామారెడ్డి టౌన్
ఏళ్ల తరబడిగా ఆస్తి పన్ను
చెల్లించని కార్యాలయాలు
చెల్లించాల్సింది
రూ. 8.49 కోట్లపైమాటే..
కామారెడ్డి మున్సిపాలిటీకి
తప్పని ఆర్థిక ఇబ్బందులు


