నిజామాబాద్ అర్బన్: ప్రజల కోసం పనిచేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు అందరూ తరలిరావాలని ఆమె ఆహ్వానించారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే వరకు ఒకలా, అయిన తర్వాత మరోలా ప్రవర్తించటం రాజకీయ ఒరవడిగా మారిందని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. నిజామాబాద్ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సక్సెస్ అయ్యిందని, పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ఎనుగందుల మురళి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


