కామారెడ్డి టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పూర్తి చేసి, అర్హులకు పంపిణీ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలపై, ముఖ్యంగా గృహ నిర్మాణ పథకాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. సరైన నిర్వహణ లేక వేల సంఖ్యలో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. చాలాచోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని, విద్యుత్ కనెక్షన్లు, నీటి సౌకర్యం లేవని పేర్కొన్నారు. పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటి పనులు వెంటనే పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్ –1 దరఖాస్తు గడుపును ఏప్రిల్ 2 వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో టూ వీలర్, త్రీవీలర్, ఎలక్ట్రికల్ వాహనాలు, సోలార్ పంపు, పాడిగేదెలు, వ్యవసాయ డ్రోన్లు, వ్యవసాయ పరికరాలు, పట్టు పెంపకం, పందిరి తీగల కూరగాయల పెంపకం, మైనర్ ఇరిగేషన్ కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం టీజీవోబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎన్‌వై గిరి నియమితులయ్యారు. కొద్ది రోజులుగా ఆయన రెవెన్యూ శాఖలో వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక్కడ ఆర్డీవోగా విధులు నిర్వహించిన వీణను దేవాదాయ శాఖలోని భూముల సంరక్షణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎన్‌వై గిరికి పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం గిరి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని గాంధారి, మద్నూర్ సీహెచ్‌సీలలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ విజయ్ భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రూం నంబర్ 105లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు 28న సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.
● అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో
గేదెకు తీవ్ర గాయాలు
● వేటగాళ్ల పనే అంటున్న గ్రామస్తులు
సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణులను పట్టుకోవడం కోసం తవుడులో నాటు బాంబును పెట్టారు. మేత మేసుకుంటూ వెళ్లిన అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కుమ్మరి శ్రీనివాస్‌కు చెందిన గేదె.. ఆ తవుడును తినగా నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడింది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


