● కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం,
బాన్సువాడల్లో ఏర్పాటు
● నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ఒకే చోట
● కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్నది లక్ష్యం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో పాఠశాల చొప్పున నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో కామారెడ్డి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాన్సువాడ నియోజకవర్గం నుంచి బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట 1,500 మంది చదువుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇప్పుడున్న భవనాల్లోనే వీటిని ప్రారంభిస్తారు.
కార్పొరేట్‌కు దీటుగా..
అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు మంచి స్పందన రావడంతో వాటిని విస్తరించేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికో స్కూల్ ఏర్పాటుకు పూనుకుంది. పేద, మధ్యతరగతి పిల్లలకు మంచి విద్యనందించే లక్ష్యంగా పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన బడులను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో మౌ లిక సదుపాయాలను మెరుగుపరిచి తరగతులు ప్రారంభించనున్నారు. తరువాత 1500 మంది విద్యార్థులకు సరిపడా గదు లు, సౌకర్యాలతో పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణం చేపడతా రు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తోంది. అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు నర్సరీ నుంచి 12 వ తరగతి దాకా ఒకే చోట చదువుకునేందుకు వీలు కలుగుతుంది.


