● అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని
నివారించవచ్చు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: విపత్తులపై అవగాహన పెంచుకుని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పెద్ద చెరువు వద్ద బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యవేక్షించారు. ప్రకృతి విపత్తులు, భారీ వరదల సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలే విధానం, ప్రజలను ఎలా రక్షించాలి, చిక్కుకుపోయిన వారిని రక్షించే పద్ధతులు, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించే విధానం, అత్యవసర సేవలకోసం ఎలా సంప్రదించాలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మాక్ డ్రిల్‌ల ద్వారా విపత్తుల సమయంలో ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా, సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చన్నారు. మాక్ డ్రిల్‌లో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సహాయక బృందాల కమాండర్ డోల్ సింగ్, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వైద్య సిబ్బంది, ఎన్‌సీసీ కెడెట్లు, స్థానికులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కామారెడ్డి క్రైం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కామారెడ్డిలోని రాజీవ్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు సాయి ఈశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


