● డీఎంహెచ్‌వో డాక్టర్ రవీందర్ గౌడ్
● జీజీహెచ్‌లో అడ్వొకసీ, సెన్సిటైజేషన్
కార్యక్రమం
కామారెడ్డి టౌన్ : జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సంపూర్ణ సురక్ష కేంద్రం(ఎస్‌ఎస్‌కే) ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎస్‌ఎస్‌కే ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వకసీ, సెన్సిటైజేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కామారెడ్డిని హెచ్‌ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవి బారిన పడే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఎస్‌ఎస్‌కే ఒక ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. జీవితకాలం పాటు వారు ఈ వ్యాధి బారిన పడకుండా అవసరమైన సలహాలు, పరీక్షలు, చికిత్సను ఈ కేంద్రం అందిస్తుందని తెలిపారు. కేంద్రానికి సంబంధించిన సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా పరిచయం చేశారు. ఎస్‌ఎస్‌కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎస్టీడీ(లైంగిక వ్యాధులు) పట్ల అవగాహన కల్పిస్తూ, జాతీయ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ 1097 ప్రాముఖ్యతను వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఏఆర్‌టీ వైద్య అధికారులు స్నేహ, ప్రీతి, కమల, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు చంద్రప్రియ, పిల్లల వైద్యులు శిరీష, ఆఫీసర్ పద్మజ, డీపీఎం శోభ, కౌన్సిలర్లు శేఖర్ గౌడ్, లలిత కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.


