● ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలో
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
కామారెడ్డి టౌన్ : దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతున్నా పాలకులకు పట్టడం లేదని, వారి తీరు దున్నపోతుపై వడగండ్ల వాన కురిసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభను మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులతో పుర వీధుల గుండా భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి వీక్లీమార్కెట్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ..పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆయుధాల వ్యాపారం కోసం అమెరికా ప్రపంచ దేశాలపై యుద్ధాలు చేస్తోందని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం, డప్పు నృత్యాలు ఆకట్టుకున్నాయి. నేతలు వి. ప్రభాకర్, కృష్ణ, పి. రామకృష్ణ, ఆర్. రమేష్, జి. సురేష్, తదితరులు పాల్గొన్నారు.


