కామారెడ్డి అర్బన్: రైతులు పంటలతో పాటు అనుబంధంగా అధిక మాంసం అందించే మేలుజాతి జీవాలను పెంచి లాభాలు పొందాలని జాతీయ మాంస పరిశోధన సంస్థ(ఎన్‌ఎంఆర్‌ఐ) డైరెక్టర్ సుఖ్‌దేవ్ బుర్బుదే అన్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, కామారెడ్డి డెయిరీ కళాశాల జాతీయ మాంస పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి కళాభారతిలో పశుసంవర్థక, వ్యవసాయ, మత్స్య, ఉద్యానవన, విజయ డెయిరీ, అధునిక వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ కంపెనీలు, బ్యాంకులు వారి వారి ఉత్పత్తుల స్టాళ్లతో కిసాన్‌మేళాను ఘనంగా నిర్వహించారు. కిసాన్ మేళా కరప్రతాలను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బుర్బుదే మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలు పెంచిన వారికి స్థానికంగా గిట్టుబాటవుతుందని, ప్రతిరైతు సమగ్ర అభివృద్ధికి పాడి పంటలతో పాటు జీవాలు పెంచాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు పశువైద్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎం.కిషన్‌కుమార్, శాస్త్రవేత్త బస్వారెడ్డిలు అవగాహన కల్పించారు. డెయిరీ కళాశాల అసోసియేట్ డీన్ సురేష్‌రాథోడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.


