దోమకొండ: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలైయ్యాయి. కాలనీకి చెందిన ముద్దసాని కనకయ్య, బ్రహ్మయ్యగారి వెంకవ్వ, జంగం లిల్లీ, సాయవ్వతోపాటు మరో చిన్నారిపై కుక్కలు దాడిచేసినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా పలువురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తరచు కుక్కల దాడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


