భిక్కనూరు: రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు జగదీశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం భిక్కనూరుకు వచ్చిన ఆయనను కామారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అతిమాముల శ్రీధర్ సన్మానించారు. జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ బార్ ఆసోసియేషన్ సభ్యుల సమస్యలను గుర్తించి, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
సుభాష్‌నగర్: వేసవికాలంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ నుంచే అప్రమత్తమయ్యామని, ఏ విపత్తు ఎదురైనా సరఫరాను నిరంతరాయంగా అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఇప్పటివరకు లోడ్ పెరిగే ప్రాంతాల్లో అంచనా మేరకు నూతనంగా 342 ట్రాన్స్‌ఫార్మర్లను ఏ ర్పాటు చేశామన్నారు. ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా 2 సబ్‌స్టేషన్లు, 17 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామ ర్థ్యం పెంచి అందుబాటులోకి తెచ్చామన్నారు.
అందుబాటులో ఇంటర్ లింకింగ్..
వినియోగదారులకు నిరంతర సరఫరా అందించాలనే ఉద్దేశంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని రాజేశ్వర్‌రావు అన్నారు. ఇప్పటివరకు 34 చోట్ల ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా.. ఆ పరిధిలో అంతరాయం ఏర్పడినా.. పరిష్కారమయ్యే వరకు మరో కేంద్రం నుంచి సరఫరా పునరుద్దరించేందుకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ, ప్రస్తుతం 137 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామన్నారు. అలాగే వినియోగదారులకు ఏ అవసరమొచ్చినా కార్యాలయాల బాటపట్టకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ వాట్సాప్ చాట్‌బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
● లోడ్ పెరిగే ప్రాంతాల్లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు


