కార్యదర్శులు పట్టించుకోవడం లేదు
ఇబ్బందులు పడుతున్నాం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గ్రామాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని గతంలో సర్పంచ్‌లు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేపట్టినా వాటికి సంబంధించిన నిధులు ఇప్పటికీ రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా వాటిని మాజీ సర్పంచ్‌లకు ఇవ్వకుండా కొత్త సర్పంచ్‌లు వాడుకుంటున్నాన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మాజీ సర్పంచ్‌లకు ఒక్క పైసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేసిన నిధులు గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు , సిబ్బంది వేతనాలకు చెల్లించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన జీవో జారీ చేసింది. కానీ ఇవేమీ కొత్త సర్పంచులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికి ఆ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమై చెల్లించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధించి మండల పరిషత్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికై నా స్పందించి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని మాజీ సర్పంచ్‌లు కోరుతున్నారు.
భూంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం
జీపీలకు వచ్చిన నిధులను మొదటగా మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులకు ఇవ్వా లని ప్రభుత్వం స్పష్టంగా జీవో జారీ చేసింది. అయినా జీపీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. నిధులను కొత్త సర్పంచ్‌లు, కార్యదర్శులు పెట్టిన బిల్లులకు తీసుకుంటూ మాకు మొండిచేయి చూపించడం సిగ్గు చేటు. మొదటగా మాకు ఇవ్వాలని నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మండల అధికారులు కూడా ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు.
– బి.భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, ధర్మారావ్‌పేట్
గ్రామం సక్కగా ఉండాలని అప్పులు చేసి అభివృద్ధి చేసినం. ఇప్పటికీ ఒక్క పైసా రాకపోవడం వల్ల మిత్తీలు కట్టలేకపోతున్నాం. గ్రామ అభివృద్ధికి సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేసి పెట్టిన. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఫస్ట్ మీకే ఇస్తారు అని చెప్పిండ్రు. కానీ వచ్చిన నిధులను దారిమళ్లిస్తూ మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా డబ్బులు మాకు చెల్లించిన తర్వాత మీరేమైన చేసుకోండ్రి. మాకు సంబంధం లేదు.
–మడిపెద్ది కవిత, మాజీ సర్పంచ్, పద్మాజీవాడి
మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు సుమారు రూ.55 లక్షలు
బిల్లులకు అడ్డు పుల్లలు
వేస్తున్న కొత్త సర్పంచులు
ప్రభుత్వ జీవోను సైతం
పట్టించుకోని వైనం
పట్టించుకోని అధికారులు


