కన్నోళ్లకు భరోసా! | - | Sakshi
Sakshi News home page

కన్నోళ్లకు భరోసా!

Mar 25 2026 7:03 AM | Updated on Mar 25 2026 7:03 AM

కన్నోళ్లకు భరోసా!

పక్కాగా అమలు చేస్తే..

తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కనిపెంచినవారిని పట్టించుకోని సంతానం వేతనంలోంచి 15 శాతం లేదా రూ. 10 వేలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ వర్తించనుంది. ఈ మేరకు తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో వృద్ధుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

న్నబిడ్డలను చదివించేందుకు, వారికోసం ఆస్తులు కూడబెట్టేందుకు తల్లిదండ్రులు ఎంతగానో చెమటోడుస్తారు. పిల్లలు చదువుకుని ప్రయోజకులైతే మురిసిపోతారు. వారు జీవితంలో స్థిరపడితే తమ కష్టాలు తీరినట్లేనని భావిస్తారు. చేతగాని వయసులో పిల్లలు ఆసరాగా ఉంటారని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. వృద్ధాప్యంలో వారు ఆశించేది కూడా పెద్దగా ఏమీ ఉండదు. పిల్లలనుంచి కాసింత ప్రేమ, నాలుగు మెతుకులు తప్ప.. అయితే పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తే.. ఉద్యోగం సంపాదించిన వారిలో కొందరు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దీంతో చాలాచోట్ల పంచాయితీలు అవుతున్నాయి. కొందరు పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. మరికొందరు ప్రజావాణికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తమ పిల్లల గురించి బయట చెబితే వారి పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక చాలామంది తమలో తామే కుమిలిపోతున్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకూ తప్పని కష్టాలు...

ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయిన పెన్షనర్లలో చాలామంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలనెలా వచ్చే పింఛన్‌ డబ్బుల కోసం వేధించే వారు ఎందరో ఉన్నారు. కొందరైతే తల్లి/తండ్రి బ్యాంకు పాస్‌ పుస్తకం, ఏటీఎం కార్డులను తమ దగ్గరే ఉంచుకుని, వారి పెన్షన్‌ను ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఓ పింఛన్‌దారు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి తమ సంతానం నుంచి ఎదురవుతున్న కష్టాలను చెప్పుకుని కంటతడిపెట్టారు.

పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్‌ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ను కేబినెట్‌ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రజాప్రతినిధులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేల చొప్పున కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పట్టించుకోని కొడుకుల జీతం నుంచి కోత

15 శాతం లేదా రూ. 10 వేలు

అందించేలా చర్యలు

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు

ప్రజాప్రతినిధులకూ వర్తింపు

తల్లిదండ్రుల మద్దతు బిల్లును

ఆమోదించిన క్యాబినెట్‌

హర్షం వ్యక్తం చేస్తున్న వృద్ధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement