● రుద్రూర్ మండల కేంద్రంలో ఘటన ● బోధన్, నిజామాబాద్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్య సేవలు
రుద్రూర్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో బస్సు, లారీ డ్రైవర్లు, 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న డస్ట్ లోడ్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ కుర్నాపల్లి క్రషర్ నుంచి స్టోన్ డస్ట్‌ను పోతంగల్ మండలం పీఎస్‌ఆర్ నగర్‌లో ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణానికి తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఆర్టీసీ డీఎం, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
బోధన్‌టౌన్ (బోధన్)/నిజామాబాద్ అర్బన్: బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీపీ సాయి చైతన్య పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళల ముఖాలకు గాయాలు కాగా దంతాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ కాలికి గాయం కాగా ఆంబులెన్స్‌లోనే చికిత్సను అందించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలాగౌడ్ తోపాటు మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


